వివిధ హోదాల్లో వైఎస్సార్ సీపీ నాయకుల నియామకం
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన నాయకులను వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీగా కొండపికి చెందిన మండవ మాలకొండయ్యను నియమించారు. జిల్లా స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీగా ఒంగోలుకు చెందిన దండు దుర్గాప్రసాద్‌రెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ వింగ్ జనరల్ సెక్రటరీగా కొండపికి చెందిన వాకా శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా లీగల్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబరుగా దర్శికి చెందిన బీరం శ్రీనివాసులరెడ్డిలను నియమించారు. కనిగిరి నియోజకవర్గ గౌడ విభాగం ప్రెసిడెంట్‌గా పరుచూరి రమేష్, కనిగిరి నియోజకవర్గ దేవాంగ విభాగం ప్రెసిడెంట్‌గా కొంపాల పెదకాశయ్య, ఒంగోలు నియోజకవర్గ గౌడ విభాగం ప్రెసిడెంట్‌గా తాతా నాంచార్లు లను నియమించారు. నాగులుప్పలపాడు మండల సోషల్ మీడియా వింగ్ ప్రెసిడెంట్‌గా పెనిగండ్ల చెన్నకేశవులను నియమించినట్లు పార్టీ కార్యాలయం తెలిపింది.
చీమకుర్తి రూరల్: మండలంలోని ఆర్‌ఎల్‌పురం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి తాళ్లూరి విజయ్ జాతీయ స్థాయి ఖోఖో జట్టుకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయిని సీహెచ్ పద్మావతి, వ్యాయామ ఉపాధ్యాయుడు కరిచేటి హనుమంతరావు తెలిపారు. కురుక్షేత్రంలో జరిగే రాష్ట్ర సబ్ జూనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయ్‌ను ఉపాధ్యాయులు అభినందించారు.
కురిచేడు: మండలంలోని జగన్నాథపురం బౌద్ధ క్షేత్రాన్ని పరిశోధకులు ఆదివారం సందర్శించారు. శోధన చారిత్రక పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో చారిత్రక పరిశోధకులు తురిమెళ్ల శ్రీనివాస ప్రసాద్ అధ్యక్షతన అన్నపురెడ్డి వీరారెడ్డి, జ్యోతి చంద్రమౌళి పర్యవేక్షణలో సుమారు 30 మందికిపైగా చరిత్ర ప్రియులు ఈ బౌద్ధ స్థూపం సందర్శించారు. ఈ బృందం అనేక చారిత్రక ఆనవాళ్లు కనుగొన్నారు. ప్రాచీన స్థూపానికి దక్షిణం వైపున ఉన్న మట్టి దిబ్బపై 12 అంగుళాలు, 18 అంగుళాలున్న రెండవ శతాబ్దపు ఇటుకలతో నిర్మించిన బౌద్ధుల కాలంనాటి మరో చిన్న స్థూపాన్ని గుర్తించారు. అలానే ఈ కొత్త స్థూపానికి 50 అడుగుల దూరంలో బౌద్ధులు ఉపయోగించిన రోలు లాంటి రాతిని, మరో వంద అడుగుల దూరంలో పురాతన మానవుల సమాధిని గుర్తించారు. ఇక్కడ రెండు వేల ఏళ్ల నాటి పిడతలు, చిన్నచిన్న కుండ భాగాలను గుర్తించారు. గుండ్లకమ్మ ఒడ్డున బౌద్ద శిల్పాన్ని గుర్తించారు. తదుపరి బౌద్ద సూపాన్ని సందర్శించి ఆనాటి బౌద్ధ జీవనవిధానం గురించి చర్చించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బౌద్ధ స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థూప రక్షక సిబ్బంది, లాయర్ శ్రీనివాస రెడ్డి, యర్రగొండపాలెం బీజేపీ పార్టీ అధ్యక్షుడు మాదాల సూర్య నారాయణ, గొట్టిపాటి ప్రభాకరరావు పాల్గొన్నారు.


