ఉద్యోగులకు 30 శాతం ఐఆర్ ప్రకటించాలి
మార్కాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తక్షణమే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మిట్టా కృష్ణయ్య, ఏఎం గిరిప్రసాద్ డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా పీఆర్‌టీయూ సమావేశంలో ఆదివారం ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలో 125 మంది విద్యార్థులకు 5 మంది ఉపాధ్యాయులు, ఒక హెచ్‌ఎంను కేటాయించాలని, ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని డిమాండ్ చేశారు. మోడల్ ప్రైమరీలో రెండేళ్ల పాటు రేషనలైజేషన్ చేయరాదని, హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరత తీర్చాలని కోరారు. 1 నుంచి 10 తరగతులు ఉన్న పాఠశాలలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు వేరు వేరుగా డైస్ కోడ్ నిర్వహించాలని, ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీసుపై కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్‌సీ అరియర్ బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరారు. 12వ పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్ ఇవ్వాలని, మెడికల్ బిల్లులు చెల్లించాలని, 45 పైబడిన ఉపాధ్యాయులకు బాడీ చెకప్‌కు ఈహెచ్‌ఎస్ ద్వారా అనుమతించాలని కోరారు. తర్లుపాడు రోడ్డులో నూతన పీఆర్‌టీయూ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎస్‌టీయూ నుంచి పీఆర్‌టీయూలో చేరిన మండ్లా రామాంజనేయులును వారు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పిల్లి రమణారెడ్డి, వెన్నా వెంకటరెడ్డి, పులి శ్రీనివాసులు, అంజిరెడ్డి, బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌వి రమణారెడ్డి, పద్మజ తదితరులు పాల్గొన్నారు.


