అర్ధరాత్రి ఆర్తనాదాలు
వెదురు కర్ర పొట్టలోకి చొచ్చుకుపోయి మృతిచెంది ట్రావెల్స్ బస్సులో ఇరుక్కుపోయిన జనార్దన్‌రెడ్డి
ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
సంఘటన స్థలంలో ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం
కొనకనమిట్ల: ట్రావెల్స్ బస్సు అతివేగం కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో అర్ధరాత్రి వేళ ప్రయాణికుల ఆర్తనాదాలతో 565వ నంబర్ జాతీయ రహదారి మార్మోగింది. కొనకనమిట్ల మండలం పెదారికట్ల–చినారికట్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్యగారిపల్లికి చెందిన అన్నపురెడ్డి జనార్దన్‌రెడ్డి (54) అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. గిద్దలూరుకు చెందిన బొలేరో వాహనం కనిగిరి నుంచి వెదురు కర్రల లోడుతో గిద్దలూరు వెళ్తూ పెదారికట్ల దాటి చినారికట్ల సమీపంలోకి వచ్చేసరికి మరమ్మతులకు గురైంది. డ్రైవర్ పీరయ్య బొలేరో వాహనాన్ని రోడ్డు మార్జిన్‌లో ఆపి లోపల నిద్రపోతున్నాడు. ఆ తర్వాత కొద్ది నిముషాల్లోనే వాసవీ ట్రావెల్స్ బస్సు ప్రొద్దుటూరు నుంచి విజయవాడ వెళ్తూ బొలేరో వాహనాన్ని వెనుకవైపు ఢీకొట్టి అదుపుతప్పి విజయవాడ నుంచి కనిగిరి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. బొలేరో వాహనంలోని వెదురు కర్రలు ట్రావెల్స్ బస్సు ముందు భాగంలోకి చొచ్చుకెళ్లి ముందు కూర్చుని ఉన్న అన్నపురెడ్డి జనార్దన్‌రెడ్డి పొట్టలోకి దిగడంతో అక్కడికక్కడే ఆయన మృతిచెందాడు. రెండు బస్సులు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో వాటిలోని డ్రైవర్లతో పాటు ప్రయాణికుల్లో 20 మందికిపైగా గాయాలయ్యాయి. వారిలో 14 మందిని కనిగిరి వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులు బలంగా ఢీకొనటంతో వచ్చిన శబ్దానికి నిద్రలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులంతా చీకట్లోనే ఆర్తనాదాలు పెట్టారు. రెండు బస్సుల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. కాగా, బొలేరో వాహనంలో పడుకుని ఉన్న డ్రైవర్ పీరయ్య అదృష్టవశాత్తూ ఎటువంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
మృతదేహాన్ని బయటకు తీసేందుకు
గంటపాటు శ్రమించిన పోలీసులు,
స్థానికులు...
ట్రావెల్స్ బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోయిన జనార్దన్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు గంటపాటు శ్రమించాల్సి వచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న కొనకనమిట్ల ఎస్‌ఐ శ్రీకాంత్ తన సిబ్బందితో పాటు స్థానికులను పిలిపించి పొక్లెయిన్ సాయంతో జనార్దన్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆర్టీసీ బస్సును పక్కకు తీయించి ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చేశారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. జనార్దన్‌రెడ్డి వృత్తిరీత్యా కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. భార్య ఉమాదేవి, కుమారుడు హేమంత్ కుమార్‌రెడ్డి, కూతురు లహరి ఉన్నారు. కుమారుడు, కూతురును విజయవాడలో చదివిస్తున్నాడు. కూరగాయల నగదు వసూలుకు శుక్రవారం రాత్రి విజయవాడకు ట్రావెల్స్ బస్సులో బయలుదేరి మార్గం మధ్యలోనే మృతి చెందాడు. అతని సోదరులు వాసుదేవరెడ్డి, పురుషోత్తంరెడ్డి, బంధువులు, స్నేహితులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని విగతజీవిగా పడి ఉన్న జనార్దనరెడ్డిని చూసి భోరున విలపించారు. బ్రహ్మంగారిమఠం ఎంపీపీ నాగేశ్వరరెడ్డి, మైదుకూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అన్నపురెడ్డి శ్రీమన్నారాయణరెడ్డి, తదితరులు చేరుకుని మృతుడి కుమారుడు, కుమార్తెను ఓదార్చారు.
కనిగిరి ఆస్పత్రిలో చేరిన
14 మంది క్షతగాత్రులు...
కనిగిరి రూరల్: రెండు బస్సుల్లో గాయపడిన 14 మందిని కనిగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేశారు. వారిలో గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాలకు చెంది ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న గౌతమి, గౌసియా, అయిషా, హుస్సేన్‌బీ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతుండగా, మిగిలిన వారు చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు. కనిగిరి ప్రభుత్వాస్పత్రిలో చేరిన క్షతగాత్రుల్లో గౌతమి (ప్రొద్దుటూరు), బీ పావని (గుంటూరు), ఎస్‌కే గౌసియా (కర్నూలు), ఎల్.భాస్కర్ (మిట్టపల్లి), ఎస్‌కే ఆషా (గుంటూరు), ఎస్‌కే హుస్సేన్‌బీ (గుంటూరు), ఎస్‌కే షంషీర్ (కనిగిరి), జీ బాలకొండయ్య (గానుగపెంట, కనిగిరి), కే వెంకటరెడ్డి (కనిగిరి), బండారు రవి (హుస్సేన్‌పురం), ఎం.జయంతి (ప్రొద్దుటూరు), కే జయరావు (గానుగపెంట, కనిగిరి), రేణుక (చాకిచర్ల), ఎంవీ సుబ్బారెడ్డి (ముద్దపాడు, పీసీ పల్లి) ఉన్నారు. వీరిలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు, మరికొందరు ఇళ్లకు వెళ్లారు.
ట్రావెల్స్ బస్సు అతివేగంతో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న బొలేరో వాహనంతో పాటు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన వైనం
ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికుడు మృతిచెందగా, రెండు బస్సుల్లోని డ్రైవర్లు, పలువురికి గాయాలు
అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో మిన్నంటిన ప్రయాణికుల రోదనలు
అర్ధరాత్రి ఆర్తనాదాలు


