శ్రీశైలం ఘాట్‌లో రోడ్డు ప్రమాదం
పెద్దదోర్నాల: అదుపు తప్పిన మోటారు సైకిల్ కొండను ఢీకొనడంతో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీశైలం ఘాట్ రోడ్డులోని చింతల గిరిజనగూడెం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చింతల ఆశ్రమ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న వై.ఆంటోని బాబు మృతి చెందారు. సమాచారం అందుకున్న ఏఎస్సై పోలురాజు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. చింతల ఆశ్రమ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆంటోని బాబు నిత్యం మోటారు సైకిల్‌పై విధులకు హాజరవుతారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లే క్రమంలో ఘాట్ రోడ్డులోని ఓ మలుపు వద్ద మోటారు సైకిల్ అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. తలకు పెట్టుకున్న హెల్మెట్ తొలగిపోయి తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలో పడి ఉన్న ఆంటోని బాబును సమాచారం అందుకున్న 108 సిబ్బంది చేరుకుని పరీక్షించగా, అప్పటికే మృతి చెందాడు. ఆశ్రమ పాఠశాలకు కొద్ది దూరం ముందే ప్రమాదం చోటుచేసుకోవటంతో సంఘటన స్థలానికి చేరుకున్న సహచర ఉపాధ్యాయులు నిర్జీవంగా ఉన్న ఆంటోని బాబును చూసి కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్సై పోలురాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆంటోని బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య కవిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అదుపుతప్పి కొండను ఢీకొన్న మోటారు సైకిల్
చింతల ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు ఆంటోని మృతి
శ్రీశైలం ఘాట్‌లో రోడ్డు ప్రమాదం


