నేత్రపర్వంగా రంగనాయకుని కళ్యాణం
రాచర్ల: రంగనాయాకా.. పాహిమాం అంటూ భక్తజనం పులకించిపోయారు. వేదమంత్రాల సాక్షిగా మంగళ వాయిద్యాల నడుమ నెమలిగుండ్ల రంగనాయస్వామి కళ్యాణాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయంలో నిర్వహించిన కళ్యాణంలో భక్తులు భారీగా పాల్గొని తిలకించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య, అర్చకులు అన్నవరం పాండురంగాచార్యులు, సత్యనారాయణాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక అలంకరణ చేసి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్తీకమాసం సందర్భంగా రెండో శనివారం నిర్వహించిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కళ్యాణాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు కాశీనాయనరెడ్ల, యోగివేమనరెడ్ల, గోపాలకృష్ణయాదవ, కృష్ణదేవరాయుల కాపు బలిజ, ఆర్యవైశ్య అన్నసత్రాల్లో అన్నసంతర్పణ చేశారు.
నేత్రపర్వంగా రంగనాయకుని కళ్యాణం


