ముడుపులు అందవనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
యర్రగొండపాలెం: మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ వైద్యశాలల వలన ముడుపులు అందవు కనుకే వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నెల 12న జరిగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమం వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంతోపాటు అనేక పాశ్చాత్య దేశాలు వైద్యాన్ని ప్రభుత్వ బాధ్యతగా తీసుకుంటున్నాయని, కొత్త చికిత్సలను ఉచితంగా అందిస్తున్న నేపథ్యంలో 1995–2004 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అనేక ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి, ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారని విమర్శించారు. వైద్య కళాశాలలు, వైద్యశాలలను ప్రైవేటీకరించడంలో భారీ అవినీతి చోటు చేసుకుందనే అనుమానాలు రాష్ట్ర ప్రజల్లో ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా వైద్యాన్ని ప్రైవేటీకరించడం తమ విధానం కాదని, ఇది కచ్చితంగా తప్పు అని చెప్పినా.. బాబు ప్రభుత్వం యధావిధిగా ముందుకు వెళ్లాలనుకోవడం అత్యంత దుశ్చర్యగా ఆయన అభివర్ణించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించటాన్ని వైఎస్సార్ సీపీ అడ్డుకుంటోందని, ఎంతటి పోరాటానికై నా, త్యాగాలకై నా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. పేదల పక్షాన నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 12న జరిగే ప్రజా ఉద్యమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మేధావులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్, ఆర్.వాగ్యా నాయక్, పార్టీ మండల అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, దోమకాళ్ల వెంకటేశ్వర్లు, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, వివిధ విభాగాల నాయకులు భూమిరెడ్డి కృష్ణారెడ్డి, కె.ఓబులరెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, ఉడుముల అరుణ, ఆర్.అరుణాబాయి, పల్లె సరళ, ఎల్లారెడ్డి రోషిరెడ్డి, కందూరి కాశీవిశ్వనాథ్, పబ్బిశెట్టి శ్రీనివాసులు, సూరె నాగేశ్వరరావు, దోగిపర్తి సంతోష్‌కుమార్, గోళ్ల కృష్ణారావు, ఎస్.సుందరరాజు, అట్లా వెంకటరెడ్డి, షేక్ కాశింపీరా, ఎం.కరీముల్లాబేగ్, షేక్.షెక్షావలి, ఆవుల రమణారెడ్డి, పి.రాములు నాయక్, సుందరరావు, టి.రాంబాబు, వై.శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్


