రైలు ఎక్కుతూ జారి పడి వ్యక్తి మృతి
కురిచేడు: కూటి కోసం కోటి విద్యలంటూ తన కుటుంబాన్ని పోషించుకునేందుకు కంప్యూటర్ ద్వారా జాతకాలు వినిపించుకుంటూ జీవిస్తున్నాడు ఓ వ్యక్తి. శుక్రవారం కురిచేడులో జరిగిన సుబ్రహ్మణ్యస్వామి జాతరకు నరసరావుపేట నుంచి వచ్చాడు. జాతరకు వచ్చిన భక్తులకు కంప్యూటర్ జాతకాలు వినిపించి కొంతమేర సంపాదన ఆర్జించాడు. శనివారం ఉదయం తమ గ్రామానికి బయలుదేరి స్థానిక రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కుతూ జారి రైలు కింద పడి మరణించాడు. మృతుడు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన నాలి శివయ్య (48)గా గుర్తించారు. ఈ దుర్ఘటనతో గుంటూరు నుంచి మార్కాపురం వెళ్తున్న డెమూ రైలు సుమారు అరగంట పాటు కురిచేడు రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయింది. అధికారులు, సిబ్బంది కలిసి మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాత రైలు కదిలింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నరసరావుపేట తరలించారు. మృతుని బ్యాగులో ఉన్న సెల్‌ఫోన్ ద్వారా మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
రైలు ఎక్కుతూ జారి పడి వ్యక్తి మృతి


