సింగరాయకొండ: ఓ స్కూటీని వెనుక నుంచి మినీ లారీ ఢీకొనడంతో స్కూటీపై ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన జాతీయ రహదారిపై సింగరాయకొండ మండలంలోని విమానాల రన్ వేపై కనుమళ్ల జంక్షన్ సమీపంలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కనుమళ్ల పంచాయతీకి చెందిన కళ్లగుంట శ్రీను హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో వ్యక్తిగత పనిమీద స్వగ్రామానికి వచ్చాడు. ఉదయం స్కూటీపై మూలగుంటపాడు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో విమానాల రన్ వేపై వస్తూ కనుమళ్ల జంక్షన్ సమీపంలో రోడ్డు మార్జిన్‌కు వెళ్లే క్రమంలో స్కూటీ వేగం తగ్గించడంతో వెనకాల వేగంగా వస్తున్న మినీ లారీ ఢీకొట్టింది. స్కూటీని కొంతదూరం మినీలారీ ఈడ్చుకుని వెళ్లడంతో శ్రీను కిందపడి తల, నడుము భాగంలో తీవ్రగాయాలయ్యాయి. హైవే అంబులెన్స్‌లో ఒంగోలు జీజీహెచ్‌కి అతన్ని తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి, ఆ తర్వాత గుంటూరు తీసుకెళ్లారు. శ్రీనుకు భార్య, కుమారుడు ఉన్నారు. ఘటన స్థలాన్ని ఎస్సై బీ మహేంద్ర పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తీవ్రగాయాలు
స్కూటీని ఢీకొన్న మినీ లారీ


