వీఆర్‌ఏల సమస్యలు తీర్చని కూటమి ప్రభుత్వం
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించలేదని, వీఆర్‌ఏల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని సీఐటీయూ అనుబంధ వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ విమర్శించారు. రాష్ట్రంలో వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించే నాథుడే కనిపించడం లేదన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వీఆర్‌ఏల సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా నాయకురాలు పి.జ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా షేక్ బందగీ సాహెబ్ మాట్లాడుతూ తెలంగాణాలో వీఆర్‌ఏలకు పే స్కేలు అమలు చేస్తున్నారని, మన రాష్ట్రంలో కూడా పే స్కేలు అమలు చేసి వీఆర్‌ఏలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చదువుకున్న వీఆర్‌ఏలు వీఆర్వో పదోన్నతి కోసం ఏళ్లతరబడి ఆశగా ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం పదోన్నతులు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తోందని చెప్పారు. ఎలాంటి పదోన్నతులు లేకుండానే కొందరు వీఆర్‌ఏలు వయోభారానికి చేరుకున్నారని తెలిపారు. దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వీఆర్‌ఏలకు అటెండర్, నైట్‌వాచ్‌మెన్ ప్రమోషన్లను 70 శాతానికి పెంచాలని, అక్రమ డ్యూటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాల ఫలితంగా వీఆర్‌ఏల పదోన్నతులు, నామినీ సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోందని తెలిపారు. సమాచారాన్ని సేకరించిన తరువాత తక్షణ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తే విజయవాడ కేంద్రంగా మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. వీఆర్‌ఏలు శ్రమదోపిడీకి గురవుతున్నారని, బెత్తెడు జీతంతో బారెడు పనులు చేయలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ గౌరవాధ్యక్షుడు జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ... వీఆర్‌ఏల వేతనాలను పెంచుతామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణలో పే స్కేలు అమలు చేయడం వలన వీఆర్‌ఏలకు రూ.20 వేల వరకు వేతనాలు వస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచకుండా, ఖాళీలను పెంచకుండా వీఆర్‌ఏలతో నైట్‌వాచ్‌మెన్, అటెండర్, డ్రైవర్ డ్యూటీలు చేయించడం దుర్మార్గమన్నారు. వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు నాగేంద్రరావు, మాధవ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.


