భూములు దోచిపెట్టి..పైసలు చేతబట్టి..!
అధికార పార్టీ నేతల అక్రమాల్లో భాగస్వాములైన రెవెన్యూ అధికారులు యథేచ్ఛగా అక్రమ భూ మ్యుటేషన్‌లు, భూముల బదలాయింపు అధికారుల తీరుపై ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ ఆదేశాలతో విచారణ అక్రమాలు నిగ్గుతేలడంతో సస్పెండ్ అయిన కనిగిరి తహసీల్దార్ అక్రమ వ్యవహారాల్లో మరికొందరు వీఆర్వోలు
కనిగిరిరూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కనిగిరి ప్రాంతంలోని అధికార పార్టీ నాయకులు భూ అక్రమాలకు తెరలేపారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి, వారికి డబ్బులు ముట్టజెప్పి యథేచ్ఛగా తమ అక్రమ దందా సాగించారు. కాసులకు కక్కుర్తిపడిన రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలకు రూ.లక్షల విలువైన భూములను అప్పనంగా కట్టపెట్టినట్లు ప్రచారం ఉంది. పట్టణంతో పాటు, మండలంలోని విలువైన భూములున్న చల్లగిరిగిల్ల, బల్లిపల్లి, కంచర్లవారిపల్లి, పునుగోడు, తదితర గ్రామాల్లోని భూముల బదలాయింపు ప్రక్రియలో, మ్యుటేషన్ విధానంలో రూ.లక్షలు చేతులు మారాయి. కీలక అధికారితో పాటు, రెవెన్యూ సిబ్బంది అధికారపార్టీ నేతల మాటలకు జీ హుజూర్ అంటూ భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. వీటిపై ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమవడంతో పాటు కొందరు బాధితులు రెవెన్యూ అధికారుల అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గత కలెక్టర్ తమీమ్ అన్సారియా కనిగిరి రెవిన్యూ కార్యాలయంలో భూ అక్రమాలు, భూ మ్యుటేషన్ అక్రమ భాగోతాలు, వెబ్‌ల్యాండ్ భూ పోర్టల్‌లో ఆన్‌లైన్ అక్రమాల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ తరుణంలో ఆమె బదిలీ అయ్యారు. దీంతో కొన్ని రోజులు మిన్నకున్న కనిగిరి రెవెన్యూ అధికారులు తిరిగి దందా సాగించారు.
జోరుగా దందా..
అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు రెండు, మూడు ముఠాలుగా ఏర్పడి కీలక అధికారికి, రెవెన్యూ అధికారులకు నజరానాలు ఇచ్చి.. ఒత్తిడి చేసి అనేక అక్రమాలు చేయించారు. ఒకరి భూమికి చెందిన సర్వేనంబర్లను మరొకరి పేరుతో ఆన్‌లైన్ ఎక్కించడం, నిబంధనలకు విరుద్ధంగా భూ మ్యుటేషన్‌లు చేయించుకోవడం, జగనన్న లే అవుట్లలో, గతంలో కనిగిరి–పొదిలి రూట్లలో, కనిగిరి–కంభం రూట్లలో, కనిగిరి–పామూరు రూట్లలో వేసిన లే అవుట్లలో వాగులు, వంకల్లోని ప్రభుత్వ సౌకర్యాల నిమిత్తం వదిలేసిన ప్లాట్లల్లోని పట్టాలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష తీసుకుని పొజిషన్ పత్రాలు ఇవ్వడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు.
రికార్డుల పరిశీలన అనంతరం తహసీల్దార్ సస్పెన్షన్:
గడిచిన మూడు నెలల్లో పదుల సంఖ్యలో భూముల మ్యుటేషన్‌లు, అసైన్డ్ పట్టాలు, అసైన్డ్ భూముల్లో పేర్ల మార్పు ఇలా అనేక అక్రమాలు చేసినట్లు కలెక్టర్‌కు పలు ఫిర్యాదులు వెళ్లాయి. అంతేగాక కొత్త కలెక్టర్‌కు బాధిత మహిళలు గ్రీవెన్స్‌లో కూడా కనిగిరి తహసీల్దార్ పై ఫిర్యాదు చేశారు. దీంతో ఒంగోలు ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించారు. రెండ్రోజుల పాటు కనిగిరిలో రికార్డుల పరిశీలన చేశారు. అనంతరం తాజాగా ఇటీవల మ్యుటేషన్లు జరిగిన కొన్ని రికార్డులను ఒంగోలుకు తీసుకెళ్లారు. అందులో పది భూ మ్యుటేషన్ ఫైళ్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని సమాచారం. దీంతో కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. తహసీల్దార్ ఏవీ రవిశంకర్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు కనిగిరి కొత్త తహసీల్దార్‌గా జయలక్ష్మిని నియమించారు.
సస్పెన్షన్ జాబితాలో నలుగురు వీఆర్వోలు..?
విచారణ అధికారులు నివేదించిన జాబితాలో నలుగురు వీఆర్వోల పేర్లు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే వీరిలో కొందరు నేరుగా తహసీల్దార్ అక్రమాల్లో భాగస్వాములుగా అయిన వారు కాగా.. కొందరు మాత్రం కేవలం అధికార పార్టీ ఒత్తిడితో ఫైల్స్ పై సంతకాలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో భూమ్యుటేషన్ జరిగిన వాటికి సంబంధించిన ఫైల్స్ పై కూడా రహస్య విచారణ సాగిస్తున్నారు. అయితే అప్పట్లో ఆ సర్వే నంబర్లకు సంతకాలు చేసిన వీఆర్వోలు రిటైర్డ్ అయి ఉన్నారు. రెవెన్యూ భూ మాయలో, అక్రమాల్లో అత్యధికంగా లబ్ధి పొందింది అధికార పార్టీ నేతలేనని రెవెన్యూ అధికారులు బహిరంగంగా చెబుతున్నారు. తాము డబ్బులు తీసుకున్నా.. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే చేశామని కొందరు రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. పట్టణ, రూరల్ గ్రామాలకు చెందిన అధికార పార్టీ నేతలు పోటీలు పడి మరీ తమ చేత అక్రమాలు చేయించారని అంటున్నారు. ఇప్పుడు అవన్నీ తమ మెడకు చుట్టుకున్నాయని..ఎవరిపై వేటుపడుతుందోనని కలవరపడుతున్నారు.
భూములు దోచిపెట్టి..పైసలు చేతబట్టి..!


