
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకుందాం
మాజీ మంత్రి మేరుగు నాగార్జున
మద్దిపాడు: రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని ఇనమనమెల్లూరు గ్రామంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పేరుతో పేదలకు వైద్యం అందిస్తే జగనన్న మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు కట్టడానికి పూనుకున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్వలాభం చూసుకునే చంద్రబాబు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడిందని దీన్ని మాజీ ముఖ్యమంత్రి జగనన్న ఖండిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారని అన్నారు. నిజంగా పేదలకు సేవ చేయాలన్న ఆలోచన కూటమి నాయకులకు ఉంటే పీపీపీ వంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోరని విమర్శించారు. మెడికల్ కళాశాలల్ని రక్షించుకుంటేనే భవిష్యత్‌లో పేదవాడి పిల్లలు డాక్టరవుతాడన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని భ్రష్టు పట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్‌లో పెట్టిన కారణంగా ఆరోగ్యశ్రీ మూతపడిపోయి ప్రజలు ఉచిత వైద్యం కోసం అల్లాడాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని విజయవంతం చేసి కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపించాలన్నారు. అనంతరం ఆయన గ్రామస్తులు పలువురితో సంతకాలు చేయించారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల పార్టీ ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, గద్దె జాలయ్య, ఆకుల శ్రీనివాసరావు, ఆవుల వెంకారెడ్డి, పల్లబోతు హనుమంతరావు, యాదల శ్రీను, జీలగ కోటేశ్వరరావు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.