ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా జోరున వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 26.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా కొత్తపట్నం మండలంలో 78.2 మిల్లీ మీటర్లు కురిసింది. మిగతా మండలాల్లో 2.4 మిల్లీ మీటరు నుంచి 78.4 మిల్లీ మీటర్ల వరకు వర్షం కురిసింది. అత్యల్పంగా చీమకుర్తి మండలంలోనే 2.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సముద్ర తీర ప్రాంత మండలాలు సింగరాయకొండలో 75.6, ఒంగోలు అర్బన్, ఒంగోలు రూరల్‌లో 60.6 చొప్పున వర్షం కురిసింది. బుధవారం కూడా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.
పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు...
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గుండ్లకమ్మతో పాటు, ముసి, మన్నేరు, పాలేరుతో పాటు ఇతర వాగులు పారుతున్నాయి. ఒంగోలు మండలంలో ఉన్న ముదిగొండ వాగు పూర్తి స్థాయి సమర్ధ్యంతో పారుతోంది. ముదిగొండ వాగు పరిసర గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ బుధవారం పర్యటించారు. సాగునీటి చెరువుల్లోకి నీరు దండిగా వచ్చి చేరుతోంది. ఇదేవిధంగా మరో రెండు రోజులు కురిస్తే దాదాపు 30 నుంచి 50 శాతం సాగు నీటి చెరువులు అలుగులు పారే స్థాయికి చేరుకుంటాయి. పెళ్లూరు చెరువు ఇప్పటికే పూర్తిగా నిండింది.
నీట మునిగిన పంటలు
ముసురు పట్టి కురుస్తున్న వర్షాలకు జిల్లాలో సజ్జ, జొన్న, పొగాకు పంటలు కొన్ని మండలాల్లో నీటమునిగాయి. మరి కొన్ని పంటలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. పొగాకు నారుమడుల దశలో ఉంది. నారు మడుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పొగాకు బోర్డు అధికారులు ఇప్పటికే పలు సూచనలు, మెళుకువలు వివరించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.శ్రీనివాసులు గ్రామాల వారీగా ఉన్న అగ్రికల్చర్ సెక్రటరీలకు రైతులను అప్రమత్తం చేసి పంటలు నీట మునగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని సూచించారు.
తీర ప్రాంత మండలాల్లో పర్యటించిన కలెక్ట:
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున బుదవారం కలెక్టర్ పీ.రాజా బాబు తీర ప్రాంత మండలాలు సింగరాయకొండ, కొత్తపట్నంలలో పర్యటించారు. అధికారుల బృందాలను అప్రమత్తం చేశారు. వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలు, వర్షాలు కురుస్తాయని సమాచారం వచ్చినందున జిల్లాలోని తీర ప్రాంతంలో ఉన్న ఐదు మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ప్రదేశాలను గుర్తించామన్నారు. అవసరమైన పక్షంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు.
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్...
భారీ వర్షాల హెచ్చరిక దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకాశం భవనంలో 1077 టోల్ ఫ్రీ నంబరుతో కమాండ్ కంట్రోల్ రూమును అధికారులు ఏర్పాటు చేశారు. 24 గంటలూ పనిచేసేలా ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూములో విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, పోలీస్, వైద్య, రెవిన్యూ, పశుసంవర్ధక శాఖలకు చెందిన సిబ్బందికి విడతల వారీగా విధులు కేటాయించారు.
ముంచెత్తిన వాన
ముంచెత్తిన వాన
ముంచెత్తిన వాన
ముంచెత్తిన వాన
ముంచెత్తిన వాన