
వెలిగొండ ఆర్‌ఆర్ ప్యాకేజీలో లోపాలు లేకుండా చూడాలి
● ప్రాజెక్టు పునరావాస, పునర్మిర్మాణ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి
● అధికారులతో సమీక్షలో కలెక్టర్ పీ.రాజా బాబు
ఒంగోలు సబర్బన్: వెలుగొండ ప్రాజెక్టు పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీ అమలులో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ పీ.రాజాబాబు ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్టు సొరంగాల పనులు, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీపై బుధవారం ప్రకాశం భవనంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి ఆయన సమీక్షించారు. ఈ పనుల్లో పురోగతిని ప్రాజెక్ట్స్ ఎస్‌ఈ. అబూత్ అలీమ్ వివరించారు. మొత్తం 11 గ్రామాలకుగాను రెండు గ్రామాల్లో పునరావాస ప్యాకేజీకి లబ్ధిదారులను నిర్ధారించాల్సి ఉందన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నిర్వాసితులందరికీ పూర్తిస్థాయిలో న్యాయం జరగాలని స్పష్టం చేశారు. నిర్వాసితుల వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్నాయో, లబ్ధిదారులుగా గుర్తించేందుకు ఎలాంటివి అవసరమో వారికి తెలియజేయడంతో పాటు ఈ మొత్తం ప్రక్రియను బహిరంగంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆ గ్రామాల ప్రజలతో ముఖాముఖి మాట్లాడాలని అన్నారు. వెలుగొండ కాలువలు, సొరంగాల పనులకు, పునరావాస ప్యాకేజీకి అవసరమైన నిధులపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసే క్రమంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివరామిరెడ్డి, సత్యనారాయణ, డీ.ఈ.ఈ.లు, ఏఈఈలు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.