
ఆరోగ్యశ్రీ లేక గాలిలో కలుస్తున్న పేదల ప్రాణాలు
యర్రగొండపాలెం: కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఎత్తివేయడం వలన పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, సకాలంలో తగిన వైద్యంలేక యర్రగొండపాలెం నియోజకవర్గంలో ముగ్గురు గుండెపోటుతో మృతి చెందారని, ఇవన్నీ.. ప్రభుత్వ హత్యలేనని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యర్రగొండపాలెం వంద పడకల వైద్యశాలలో గుండెపోటుకు సంబంధించిన ఇంజక్షన్‌లు ఉన్నాయని, కానీ వాటిని ఉపయోగించే కార్డియాలజిస్ట్ లేడని, తగిన పరికరాలు లేకపోవడంతో బాధిత రోగులు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించాల్సి వస్తోందని అన్నారు. బోయలపల్లె గ్రామానికి చెందిన బొమ్మాజి బాలచెన్నయ్య గుండెపోటుతో స్థానిక ఒక ప్రైవేటు వైద్యశాలలో చేరాడని, ఆర్థిక స్థోమతలేక పోవడంతో అతనిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారని, అక్కడ వైద్యం కోసం రెండు రోజులు పడిగాపు కాయాల్సి రావడం వలన ఈ నెల 21వ తేదీ చెన్నయ్య మృతి చెందాడని అన్నారు. చెన్నయ్యకు సకాలంలో వైద్యం అందించమని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను సంప్రదించేందుకు తాను పలుమార్లు ఫోన్ చేసినా ఆయన రెస్పాండ్ కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని, ఈ విషయం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు తన ఓఎస్‌డీ ద్వారా సమాచారం అందించానని అన్నారు. 21వ తేదీన మురారిపల్లె గ్రామానికి చెందిన నారు వెంకటనారాయణమ్మకు గుండెపోటు వచ్చిందని, ఆమెను ఒక ప్రైవేటు వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయిస్తున్న సమయంలో మృతి చెందిందని, పుల్లలచెరువు మండలంలోని గంగవరం గ్రామానికి చెందిన కందుల నగేష్‌కు గుండెపోటు రావడంతో ఆయనను వైపాలెంలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చేర్పించాల్సి వచ్చిందని అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని అన్నారు. ఆరోగ్యశ్రీ లేకపోవడం వలన వారి కుటుంబాలు డబ్బుల కోసం వెతుకులాడుకోవడం వలన కూడా వారు సకాలంలో వైద్యశాలలో చేర్పించలేక తమ కుటుంబ పెద్దను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవన్నీ ప్రభుత్వ హత్యలే...
ప్రభుత్వ వైద్యశాలల్లో తగిన వసతులు కల్పించకుండా వైద్యులను నియమించకపోవడం వలన పేదలు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించాల్సి వస్తుందని, గత ప్రభుత్వ కాలంలో జగనన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని అనేక వైద్యశాలల్లో ఏర్పాటు చేయించి, వారికి సకాలంలో డబ్బులు చెల్లిస్తుండటంతో పేదలు ఆయా వైద్యశాలల్లో చేరి సకాలంలో వైద్యం తీసుకొని తమ ప్రాణాలు కాపాడుకోగలిగారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేటు వైద్యశాలలకు చెల్లించాల్సిన బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతోపాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడం వలన పేదలు అనేక మంది మృతి చెందుతున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పేదలకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని, ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.3 లక్షల ప్రకారం అందచేసి మృతుల కుటుంబాలకు అండగా నిలిచారని, ప్రస్తుతం అటువంటి పరిస్థితిలేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, ఆర్.అరుణాబాయి, పల్లె సరళ, డి.సుబ్బారెడ్డి, బి.రమణారెడ్డి, అంగిరేకుల ఆదినారాయణ, రంగబాబు, నారు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
తగిన వైద్యంలేక గుండె పోటుతో ముగ్గురు మృతి
ఇవన్నీ కూటమి ప్రభుత్వ హత్యలే
వైపాలెం వైద్యశాలలో ఇంజక్షన్‌లు ఉన్నాయి.. కార్డియాలజిస్ట్ లేడు
నిర్లక్ష్యంగా గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు ఫిర్యాదు
ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్