మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు నిరసనగా కోటిసంతకాల సేకరణ ఉమ్మడివరం రచ్చబండలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
పుల్లలచెరువు: మీ సంతకం మీ పిల్లల భవిష్యత్‌కు బంగారు బాట వేస్తుందని, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మండలంలోని ఉమ్మడివరం గ్రామంలో మండల పార్టీ కన్వీనర్ డి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బుధవారం కోటిసంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. పలు కళాశాలలు నడుస్తున్నాయని, మరి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. పేదవాళ్లు అభివృద్ధి చెందడం ఇష్టం లేని చంద్రబాబు మెడికల్ కళాశాలలన్నీ ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల విద్యార్థులకు వైద్య విద్యను అందని ద్రాక్షగా మార్చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోను, ఇప్పుడు కూడా చంద్రబాబు పరిపాలనలో ఒక్క మెడికల్ కాలేజీ తీసుకునిరాక పోగా జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటని అన్నారు. ఇటువంటి దుర్మార్గపు పనిని అడ్డుకునేందుకు రాజకీయాలకు అతీతంగా జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలంతా ఏకంకావాలని పిలుపునిచ్చారు. నమ్మి ఒట్లు వేసిన ప్రజలను నట్టేట ముంచడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు. మెడికల్ కళాశాలల్ని రక్షించుకుంటేనే భవిష్యత్‌లో పేదల పిల్లలు వైద్యులు అవుతారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాలు సేకరించి వాటిని గవర్నర్‌కు పంపించి చంద్రబాబు దుష్టపన్నాగాన్ని అడ్డుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ డి.వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఎల్.రాములు, మాజీ ఎంపీపీ ఎం.సుబ్బారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.రఘు, జిల్లా ఉపాధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, నాయకులు కోడిరెడ్డి, వీరారెడ్డి, నాసర్‌రెడ్డి, గొడుగు ఆంజనేయులు, వెంకిరెడ్డి, వెంకటరెడ్డి, రోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.