
గడ్డి మందు తాగి యువకుడు మృతి
మర్రిపూడి: గడ్డి మందు తాగిన ఓ యువకుడు వైద్యశాలలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు.. మండల కేంద్రమైన మర్రిపూడి వడ్డెపాలేనికి చెందిన మండే బసవయ్య, గౌరమ్మ దంపతుల కుమారుడు రాజు(36)కు స్వగ్రామానికే చెందిన తమ్మిశెట్టి భూలక్ష్మితో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు ఉన్నారు. డోజర్ కొనుగోలు చేసి ఒంగోలులో బాడుగకు తిప్పుతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు ఒంగోలు వైఎస్సార్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో వారం క్రితం ఒంగోలులో తాను ఉంటున్న నివాసంలో గడ్డి మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆయనను ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందగా స్వగ్రామమైన మర్రిపూడి మృతదేహాన్ని తీసుకొచ్చారు. తల్లి గౌవమ్మ, భార్య భూలక్ష్మి బోరున విలపిస్తుండటం పలువురిని కంటతడి పెట్టించింది.
కురిచేడు: ౖబెక్ అదుపు తప్పి రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం కురిచేడు–పెనగమూరు గ్రామాల మధ్య చోటుచేసుకుంది. వివరాలు.. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం మృత్యుంజయపురం గ్రామానికి చెందిన యర్రగుంట్ల మహేష్(35) జామాయిల్ తోటలు నరికేందుకు కూలీలను తీసుకెళ్తుంటాడు. గతంలో చేసిన పనులకు డబ్బులు రాక, కూలీలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు. సోమవారం ఉదయం జామాయిల్ తోటలు కొట్టించేందుకు అడ్వాన్సు తీసుకుని వచ్చేందుకు బైక్‌పై దర్శి బయలుదేరాడు. కురిచేడు దాటిన 3 కిలోమీటర్ల తర్వాత బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చింతచెట్టును ఢీకొనడంతో మహేష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి బార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.శివ తెలిపారు.
మార్కాపురం: ఇంట్లో కుటుంబ సభ్యుల మీద అలిగి తన నలుగురు పిల్లలను తీసుకుని మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో తిరుగుతున్న మహిళను స్థానిక పోలీసులు సురక్షితంగా కుటుంబ సభ్యులకు చెంతకు చేర్చారు. యర్రగొండపాలెం మండలం రేగులపల్లి గ్రామానికి చెందిన కోటమ్మ భర్తపై అలిగి తన పిల్లలు అనీల్, నాగేంద్ర, నాగేశ్వరి, మరొకరిని వెంటబెట్టుకుని ఆదివారం రాత్రి మార్కాపురం బస్టాండుకు చేరింది. పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే భోజనం తీసుకురావడానికి బయటకు వచ్చి తప్పిపోయింది. సోషల్ మీడియాలో చిన్నారుల ఫొటోలు వైరల్ కావడంతో మార్కాపురం పోలీసులు స్పందించారు. పిల్లలు రైల్వేస్టేషన్‌లో బెంచీలపై కూర్చుని ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్సై అంకమరావు ఆమె వద్దకు వెళ్లి భర్త, తల్లిదండ్రుల వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను మార్కాపురం పిలిపించి, కౌన్సెలింగ్ అనంతరం అప్పగించారు.

గడ్డి మందు తాగి యువకుడు మృతి

గడ్డి మందు తాగి యువకుడు మృతి