
మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే సహించం
● ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతామన్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున
మద్దిపాడు: ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే సహించేది లేదని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున అన్నారు. మండల కేంద్రం మద్దిపాడు సమీపంలోని ఘడియపూడి కాలనీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదలకు విద్య, వైద్యం అందేలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కృషిచేసి పేద విద్యార్థులకు మెడికల్ కళాశాలను అందుబాటులోకి తీసుకొచ్చారని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆలంబనగా నిలిచేందుకు వారు నిలిచారని ప్రశంసించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం దక్కకుండా నిలువరించినందుకు తన అనుయాయులకు అవకాశం కల్పించేలా చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. పేదలకు అందాల్సిన న్యాయమైన వైద్యం అందటం లేదన్నారు. ప్రతి ప్రభుత్వ పథకంలో పేదల పట్ల వివక్ష చూపిస్తూ కూటమి సర్కారు నియంతృత్వంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వం కళ్లు తెరిపించడం కోసమే కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, గడియపూడి సర్పంచ్ బొమ్మల రామాంజనేయులు, శరణం సురేష్, బొమ్మల జగ్గయ్య, తలతోటి వెంకటేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.