
గ్రానైట్ అనకొండలు
చీమకుర్తిలో 258.67 ఎకరాలు, ఆర్‌ఎల్‌పురం, బూదవాడల్లో మరో 150 ఎకరాల ప్రభుత్వ భూములు గ్రానైట్ వ్యాపారులకు ధారాదత్తం ఆక్రమణలను తొలగించాలంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ కొండపోరంబోకు, వాగులు, అనాధీనం, బండిదారి, కాలిదారి పేరుతో ఉన్న ప్రభుత్వ భూములూ స్వాహా చట్టాలను తుంగలో తొక్కి గ్రానైట్ యజమానులకు కట్టబెట్టిన రెవెన్యూ, మైన్స్ అధికారులు వాగులు, సాగర్ కాలువలను ఆక్రమించుకున్నారని హైకోర్టులోనే ప్రజాప్రయోజన వ్యాజ్యం
ప్రభుత్వ భూముల్లో
కొండలను సైతం తొలిచేస్తున్న గ్రానైట్ క్వారీ
చీమకుర్తి:
పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి సెంటు భూమి ఇవ్వమంటే రెవెన్యూ అధికారులు ముఖం చాటేస్తారు. రిటైర్డ్ పెన్షనర్ల సంఘ నాయకులు తమ కార్యాలయానికి 5 సెంట్లు స్థలం చూపండని పార్టీల నాయకులు, అధికారుల చుట్టూ తిరిగి కాళ్లు అరిగాయే తప్ప సెంటు స్థలం ఇచ్చింది లేదు. ప్రభుత్వానికి చెందిన వందలాది ఎకరాల భూములను గ్రానైట్ యజమానులకు అధికారికంగా కట్టబెట్టడంలో రెవెన్యూ అధికారుల చేతివాటం చూస్తే సామాన్యుడికి నోట మాటరావడం లేదు. చీమకుర్తి రెవెన్యూలో సర్వే నంబర్‌లు 958 నుంచి 1058 వరకు ఉన్న 258.67 ఎకరాల ప్రభుత్వ భూములను గ్రానైట్ వ్యాపారులు అడ్డదారుల్లో స్వాహా చేశారు. అద్దంకికి చెందిన పులిపాటి హేబేలు ఈనెల 17వ తేదీన చీమకుర్తి రెవెన్యూ పరిధిలోని 258.67 ఎకరాల ప్రభుత్వ భూములను గ్రానైట్ పెద్దలు ఆక్రమించుకున్నారని హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేయటంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్ చీమకుర్తి, ఆర్.ఎల్.పురం, బూదవాడ రెవెన్యూ పంచాయతీల్లో దాదాపు 3 వేల హెక్టార్లలో నిక్షిప్తమై ఉంది. వాటిలో ప్రభుత్వానికి చెందిన అనాధీనం, వాగులు, కొండ పోరంబోకులు, బండి దారి వంటి పలు కేటగిరీలకు చెందిన ప్రభుత్వ భూములు చీమకుర్తి, ఆర్.ఎల్.పురం, బూదవాడ రెవెన్యూ గ్రామాల్లో ఉన్నాయి. వాటిలో ప్రభుత్వానికి చెందిన భూములను చీమకుర్తి రెవెన్యూ పరిధిలోని మణికంఠ గ్రానైట్, కృష్ణసాయి గ్రానైట్స్, వాసవీ గ్రానైట్స్ యజమానులతో పాటు ఇతర వ్యాపారులు ఆక్రమించుకున్నారని పులిపాటి హేబేలు అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటీషన్‌ను లాయర్ జడ శ్రావణకుమార్ ద్వారా దాఖలు చేశారు. వారితో పాటు హంస గ్రానైట్స్, జయమినరల్స్, ఎన్‌వీ ఎక్స్‌పోర్ట్ యజమానులు కూడా ప్రభుత్వ భూములలో ఆక్రమణదారులుగా ఉన్నారని హేబేలు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, చీమకుర్తి తహసీల్దార్‌తో పాటు గ్రానైట్ యజమానులు ఇందుకు బాధ్యులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు.
మూడు పంచాయతీల్లో 400 ఎకరాలకుపైగా ఆక్రమణలు
చీమకుర్తిలోని సర్వేనంబర్ 958 నుంచి 1058 వరకు 258.67 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్లు హైకోర్టులో సమర్పించిన రిట్‌పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్.ఎల్.పురం, బూదవాడ పంచాయతీల్లో మరో 150 ఎకరాల ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. వాటన్నిటిలో కలిపి గ్రానైట్ యజమానులు రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురిచేసి పేదలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయించి తమకు అనుకూలంగా మార్చుకొని వేలాది కోట్ల విలువ చేసే గ్రానైట్ సంపదను దోచుకెళుతున్నారు. కొన్ని భూముల్లో నేరుగా క్వారీయింగ్ చేసుకుంటుండగా మరికొన్ని భూముల్లో వేస్ట్ రాళ్లు, మట్టిని పోసుకునేందుకు డంపింగ్ అవసరాలకు వాడుకుంటున్నారు.
పేదవాడికి సెంటు భూమి లేదంటారు...
పెద్దవారికి ఎకరాలకు ఎకరాలు ఎలా ఇస్తారు?
పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి సెంటు భూమి ఇవ్వమంటే లేదంటారు. అలాంటిది పేదలకు ఇచ్చిన భూముల పట్టాలను రద్దు చేసి గ్రానైట్ యజమానులకు ఎలా ఇస్తారు. గ్రానైట్ యజమానుల ఆక్రమణల పరిధిలోనున్న ప్రభుత్వ భూములను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
– బండ్ల కొండలు,
జేఏసీ అధ్యక్షుడు, చీమకుర్తి
భూముల ఆక్రమణలపై
నోటీసులు అందలేదు
చీమకుర్తిలోని గ్రానైట్ భూములపై ఆక్రమించుకున్న వారి గురించి హైకోర్టు ద్వారా నాకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదు. మెయిల్స్ అందలేదు. ఆ వివరాలు తెలిసిన తరువాత దాని మీద పరిస్థితులు ఏంటో తెలుసుకొని చెప్తాను.
– ఆర్.బ్రహ్మయ్య,
తహసీల్దార్ చీమకుర్తి
ప్రభుత్వ భూములను గ్రానైట్
యజమానులకు కట్టబెట్టడం దారుణం
ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను గ్రానైట్ యజమానులు ఆక్రమించుకోవడం దారుణం. ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు సర్వే చేసి వాటిని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది. జిల్లా అధికారులు జోక్యం చేసుకొని గ్రానైట్ యజమానుల పరిధిలోనున్న గ్రానైట్ భూములను రద్దు చేయాలి
– వేమా చినకోటేశ్వరరావు, జైభీమ్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి, చీమకుర్తి.

గ్రానైట్ అనకొండలు

గ్రానైట్ అనకొండలు

గ్రానైట్ అనకొండలు