
జర్నలిస్టులపై అక్రమ కేసులతో వేధింపులు దారుణం
కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు వాస్తవాలను వెలుగులోకి తేస్తే అక్రమ కేసులా.. జర్నలిస్టులపై కేసులు ఉపసంహరించుకోవాలి వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి
ఒంగోలు సిటీ: సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలుచుకునే జర్నలిజంపై దాడి చేయడమేనని ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. ఒంగోలులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జరల్నిస్టులపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం హిట్లర్ వంటి నియంతల పాలనలను గుర్తు చేస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం సాక్షి పత్రిక, టీవీల ప్రసారాలపై కక్ష కట్టి వ్యవహరిస్తోందన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడమే అందుకు నిదర్శనమని చెప్పారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటంపై సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన కొన్ని గంటల్లోనే సిట్ అధికారులు ధనుంజయ రెడ్డి పై కేసులు పెట్టేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు. 40 ప్రశ్నలతో ప్రశ్నావళిని రూపొందించి తక్షణమే సమాధానం చెప్పాలని ధనుంజయ రెడ్డిని ఒత్తిడి చేయటం అధికారులు ప్రభుత్వానికి సాగిల పడినట్లు అర్థమవుతోందని అన్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యం సిండికేట్లను ఛేదించటం, అక్రమార్కులపై కథనాలను రాయటం ధనుంజయ రెడ్డి చేసిన తప్పా? అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న నకిలీ మద్యం భాగోతాన్ని సైతం గత ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయటం కూటమి ప్రభుత్వం దివాలా కోరు చర్యలకు నిదర్శనమని, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. నెల్లూరు జిల్లా సాక్షి బ్యూరో ఇన్చార్జికి సైతం అధికారులు నోటీసులు ఇవ్వడం దారుణమని బత్తుల విమర్శించారు. నకిలీ మద్యం వ్యవహారంలో 18 నెలలుగా నిద్ర నటించిన అధికారులు అది వెలుగు చూడగానే ఎదురుదాడికి దిగటం వారి పలాయన వాదానికి నిదర్శనమని అన్నారు. జర్నలిజం ఎంతో పవిత్రమైన వృత్తి అని, దానిపై దాడి చేసిన ప్రభుత్వాలు గతంలో కాలగర్భంలో కలిసిపోయిన సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలని ఆయన హెచ్చరించారు. వాస్తవాలను మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్న రిపోర్టర్లు, మీడియా వ్యవస్థలపై కేసులు పెట్టి వేధించటం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను మీడియా వ్యవస్థ, రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.