
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం 6.9 మిల్లీ మీటర్ల సరాసరి వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా సరాసరికంటే ఎక్కువగా పడి 8.7 మిల్లీ మీటర్లు నమోదైంది. జిల్లా మొత్తం 269.2 మిల్లీ మీటర్లు వర్షం కురవాల్సి ఉంటే 338.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దానిప్రకారం జిల్లా మొత్తంలో సరాసరి కంటే 26 మిల్లీ మీటర్ల అధికంగా వర్షం కురిసినట్లయింది. జిల్లాలో అత్యధికంగా సీఎస్‌పురం మండలంలో 32.4 మిల్లీ మీటర్లు కురిసింది. మిగతా మండలాల్లో 1 మిల్లీ మీటరు నుంచి 16.6 మిల్లీ మీటర్ల వరకు వర్షం కురిసింది. ఎనిమిది మండలాల్లో అసలు వర్షమే కురవలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం సాయంత్రం నుంచే వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయి. ఒంగోలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మోస్తరు వర్షం కురిసింది. ఒంగోలు నగరంలో రోడ్లు జలమయమయ్యాయి.