
మత్స్యకారులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి
ఒంగోలు సబర్బన్: మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన చాంబర్‌లో మత్స్యశాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జిల్లా మత్స్యశాఖ అధికారి, మెంబర్ కన్వీనర్ సీహెచ్ శ్రీనివాసరావు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని కమిటీకి వివరించారు. సముద్ర తీర మత్స్యకారులకు పీఎంఎంఎస్‌వై పథకం ద్వారా తెప్పలు, ఇంజిన్లు, వలలు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. సీఆర్‌సీఎఫ్‌వీ పథకం కింద లైఫ్ జాకెట్లు, జీపీఎస్ సెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు సరఫరా చేసేందుకు ఎంపిక చేసిన కొత్తపట్నం పల్లెపాలెం మత్స్యకారుల జాబితాను ఆమోదించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ బి.చిరంజీవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా నీటిపారుదల శాఖ ఎస్‌ఈ వరలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ టి.నారాయణ, ఎల్‌డీఎం డి.రమేష్, సీఎంఎఫ్‌ఆర్‌ఐ అధికారి జి.సుధాకర్, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు.పేరయ్య పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వాస్తవ స్ఫూర్తితో వినియోగించాలి
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వాస్తవ స్ఫూర్తితో వినియోగించాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. మంగళవారం ప్రకాశం భవనంలో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ ప్లాన్ 2025–26పై కలెక్టర్ సమీక్షించారు. వివిధ శాఖలకు ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ నిధులను ప్రభుత్వం కేటాయించిన తీరు, ఖర్చు చేసిన విధానంపై ఆరా తీశారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.లక్ష్మా నాయక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. కొన్ని శాఖలు లక్ష్యాలకు దూరంగా ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల అభివృద్ధి, వారి ఆవాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి మెరుగుపరచాలనే ఆశయంతో ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని, అదే స్ఫూర్తితో ఆయా వర్గాలకు ప్రయోజనం కలిగేలా నిధులు ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తానని, వచ్చే సమావేశం నాటికి నిధుల వినియోగంలో స్పష్టమైన మార్పు కనిపించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ పీ.రాజా బాబు