కొత్తపట్నం: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటుపై పిడుగు పడిన సంఘటన మంగళవారం ఉదయం కొత్తపట్నం తీరంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా, మరో ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడ్డారు. బాధితుల కథనం మేరకు.. మంగళవారం ఉదయం నలుగు కలిసి బోటుతో వేటకు బయలుదేరారు. కొత్తపట్నం –పిన్నింటివారిపాలెం మధ్యలో సముద్రంలోకి ఒక నాటికల్ మైల్(ఒకటన్నర కి.మీ) దూరం వెళ్లి వల వేయగా సుమారు 30 కేజీల రొయ్యలు లభించాయి. రెండోసారి వల వదిలిన సమయంలో బోటుకు అత్యంత సమీపంలో పిడుగు పడింది. బోటు నడుపుతున్న సైకం శ్రీను పిడుగుపాటుకు గురవడంతో కుడి బుజంపై తీవ్ర గాయమైంది. రెయిన్ కోట్ సైతం కాలిపోవడంతో వేడికి తట్టుకోలేక సముద్రంలోకి దూకేశాడు. తోటి మత్స్యకారులు హుటాహూటిన బోటును ఒడ్డుకు తీసుకొచ్చి, శ్రీనును ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పిడుగు ధాటికి బోటుకు ఆరు చోట్ల రంధ్రాలు పడ్డాయి. సుమారు రూ.70 వేలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి పరిహారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న మత్స్యకార శాఖ ఏడీ సంగాని శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.
ఒకరికి గాయాలు, మరో ముగ్గురు సురక్షితం
సముద్రంలో మత్స్యకారుల పడవపై పిడుగు