
వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యం, ఆనందం
● డీఈఓ కిరణ్ కుమార్
ఒంగోలు సబర్బన్: వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం, ఆనందం కలుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి ఏ.కిరణ్ కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో బుధవారం నిర్వహించిన గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కార్యక్రమాన్ని డీఈఓ ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ, విజయవాణి చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా డీ వార్మింగ్ టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం రాదన్నారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ప్రాధాన్యతను వివరించారు. డాక్టర్ వీరభద్రుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల శుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో స్టెప్ అండ్ యూత్ స్పోర్ట్స్ జిల్లా అధికారి శ్రీమన్నారాయణ, జిల్లా ఉమన్ చైల్డ్ డిపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సువర్ణ పాల్గొన్నారు.
సంతనూతలపాడు: మండలంలోని మైనంపాడు హైస్కూల్లో ఈనెల 17వ తేదీ 69వ స్కూల్ గేమ్స్ హాకీ అండర్ 14, అండర్ 17 బాయ్స్ అండ్ గరల్స్ జిల్లా టీం సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ డాక్టర్ చెక్క వెంకటేశ్వర్లు, ఏ శిరీష కుమారి తెలిపారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా, పర్యవేక్షకులుగా డీఈఓ ఏ కిరణ్ కుమార్ హాజరవుతున్నట్టు చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉన్న హాకీ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు. అండర్ 17 లో పాల్గొనే ఇంటర్మీడియెట్ బాలబాలికలు టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో, పాన్ నంబర్, అపార్ ఐడీని ప్రిన్సిపల్‌తో అటిస్టేషన్ చేయించుకోవాలన్నారు.