
బస్సులు లేక అవస్థలు
● ప్రధాని పర్యటన నేపథ్యంలో రాయలసీమ జిల్లాలకు బస్సుల కేటాయింపు ● జిల్లా నుంచి 160 బస్సులు తరలింపు
మార్కాపురం: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న నంద్యాల జిల్లా శ్రీశైలం, కర్నూలులో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్న నేపథ్యంలో జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు, కనిగిరి, పొదిలి డిపోల నుంచి సుమారు 160 బస్సులను నంద్యాల, కర్నూలు జిల్లాలకు పంపడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పలువురు బస్టాండులకు రాగా బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా పలు బస్టాండుల్లో బస్సులు లేక ఖాళీగా కనిపించగా, ప్రయాణికులతో నిండిపోయాయి. అరకొరగా వచ్చే బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు సీట్ల కోసం యుద్ధమే చేయాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల బుధవారం వర్షం కురవడంతో అటు బయటకు రాలేక, ఇటు బస్టాండులో ఉండలేక మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిల్లా పాపలు, లగేజీతో బస్టాండుకు వస్తే బస్సులు లేవు. ముఖ్యంగా మార్కాపురం నుంచి విజయవాడ, ఒంగోలు, కడప, వినుకొండ, మాచర్ల, గిద్దలూరు తదితర ప్రాంతాలతో పాటు గ్రామాలకు వెళ్లే పలు సర్వీసులను తాత్కాలికంగా రద్దుచేసి రాయలసీమ జిల్లాలకు పంపారు. మార్కాపురం పట్టణానికి వచ్చేందుకు సమీప గ్రామాల ప్రజలు ఆటోలను ఆశ్రయించగా కంభం, పెద్దారవీడు, పెద్దదోర్నాల, త్రిపురాంతకం, కొనకనమిట్ల, పొదిలి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సకాలంలో బస్సులు లేకపోవడంతో ఆటోల్లో లేదా కార్లు బాడుగకు మాట్లాడుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిద్దలూరు నుంచి 35, మార్కాపురం నుంచి 35, ఒంగోలు నుంచి 35, కనిగిరి నుంచి 35, పొదిలి నుంచి 20 బస్సులను కర్నూలు, నంద్యాల జిల్లాలతోపాటు రాయలసీమ జిల్లాలకు పంపారు. గురువారం కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. దీంతో పలువురు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.