
వైద్య విద్యకు కూటమి సర్కారు సమాధి
పొదిలిలో సంతకాల సేకరణను ప్రారంభిస్తున్న బత్తుల, అన్నా రాంబాబు
ఉప్పలపాడులో సంతకాల సేకరణలో పార్టీ నేతలు
పొదిలి రూరల్:
సామాన్యులు, పేదలకు వైద్యం, వైద్య విద్య అందకూడదనే దురుద్దేశం, అనుచరులకు ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టే దుర్మార్గపు ఆలోచనలతో సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడె బత్తుల బ్రహ్మానందరెడ్డి, మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని బుధవారం పొదిలి, ఉప్పలపాడు గ్రామాల్లో ప్రారంభించారు. పొదిలి విశ్వనాథపురంలో పార్టీ నగర పంచాయతీ అధ్యక్షుడు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి, ఉప్పలపాడులో మండల పార్టీ అధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డితో కలిసి సర్కారు తీరుకు నిరసనగా సంతకాల సేకరణ చేపట్టారు. ముందుగా ఆయా ప్రాంతాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి ఘన నివాళులర్పించారు. కోటి సంతకాల సేకరణ సమావేశాల్లో బత్తుల, అన్నా మాట్లాడుతూ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు మెరుగైన వైద్యం, విద్య అందించేందుకు రాష్ట్రంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. వాటిలో ఇప్పటికే 7 కాలేజీలు ప్రారంభం కాగా, మరో 10 కాలేజీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. కూటమి గద్దెనెక్కిన తర్వాత వైద్య కళాశాలలను సమాధి చేసేందుకు కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. దాదాపు రూ.లక్ష కోట్లు విలువ చేసే ప్రభుత్వ వైద్య కళాశాలలను, వేలాది ఎకరాల భూములను సీఎం చంద్రబాబు తన అనుచరులకు కట్టబెట్టేందుకు పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు చీకటి బాగోతాన్ని బట్టబయలు చేసేందుకు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో రాష్ట్ర ప్రజలకు కలిగే నషం, ఇబ్బందులను వివరించేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, పార్టీ రారష్ట్‌ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, నాయకులు గొలమారి చెన్నారెడ్డి, సాయి రాజేశ్వరరావు, కె నరసింహరావు, కల్లం సుబ్బారెడ్డి, జి.శ్రీనివాసులు, నూర్జహన్ బేగం, గౌసియా బేగం, యక్కలి శేషగిరి రావు, మస్తాన్‌వలి, ఫిరోజ్, వెంకటేశ్వరరెడ్డి, పార్టీ వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అందులో భాగమే..
ప్రజా సమస్యలు గాలికొదిలేసి దోపిడీకి తెరలేపారు
వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల, మాజీ ఎమ్మెల్యే అన్నా ధ్వజం
కూటమి సర్కారు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పొదిలిలో కోటి సంతకాల సేకరణ

వైద్య విద్యకు కూటమి సర్కారు సమాధి