
సర్కారు గొప్పలు.. ప్రయాణికులకు తిప్పలు
ఒంగోలు టౌన్: ప్రధాన మంత్రి కర్నూలు పర్యటనకు జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, పొదిలి, మార్కాపురం, కనిగిరి డిపోల నుంచి 160 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ఇందులో ఒంగోలు డిపోలో 74 పల్లెవెలుగు బస్సులుండగా ఏకంగా 40 బస్సులను కర్నూలు సభకు తరలించినట్లు సమాచారం. మంగళవారమే జిల్లా నుంచి బస్సులన్నీ వెళ్లిపోయాయి. తిరిగి 17వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి గానీ బస్సులు జిల్లాకు చేరుకోవు. 18వ తేదీ నుంచి రోడ్డు మీదకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద మూడు రోజుల పాటు జిల్లాలో సగం పల్లెవెలుగు బస్సులు కనిపించవు. మహిళలకు ఉచిత బస్సు పథకంలో ప్రధానంగా పల్లెవెలుగు బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డిపోలో ఉన్న బస్సుల్లో సగం బస్సులను కర్నూలు సభకు తరలించడంతో మహిళా ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. వందలాది గ్రామాలకు బస్సులు వెళ్లే అవకాశం లేదు కనుక ఆయా గ్రామాలకు చెందిన ప్రయాణికులు, మహిళలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి. మహిళలకు ఉచిత బస్సులు ప్రారంభించినప్పటి నుంచి సభలు, సమావేశాలంటూ ఆర్టీసీ బస్సులను తరలించడం నిత్యకృత్యమైపోయిందని ఆర్టీసీ యూనియన్ నాయకులు విమర్శిస్తున్నారు.