
పీపీపీ ఓ దండగమారి విధానం
ఒంగోలు వన్‌టౌన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి సర్కారు తెరపైకి తెచ్చిన పీపీపీ విధానం ఓ దండగమారి పంచాయితీ అని, తక్షణమే పీపీపీ మోడల్‌ను ఉపసంహరించుకోవాలని దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఒంగోలులోని కలెక్టరేట్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ సంక్షేమంపై ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచారని విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్‌లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో మాల కార్పొరేషన్‌కు రూ.341 కోట్లు, మాదిగ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారే కానీ 16 నెలలుగా ఒక్క రూపాయి కూడా అర్హులకు అందించలేదని దుయ్యబట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.వేల కోట్లతో ఎస్సీ, ఎస్టీ యాక్షన్ ప్లాన్ ప్రకటించి ఆరు నెలలైనా ఒక్క రూపాయి నిధులివ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకాలకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. దళితులు పోరాడి సాధించుకున్న ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులైనా మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు అబ్రహాము, జాన్ వెస్లీ, యేసు దాస్, ధనరాజ్, జిలాని, బ్రహ్మ, సామేలు, మోషే, మరియమ్మ, శాంతి, విజయలక్ష్మి, మనోహర్, కావేరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టొద్దు
ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి రుణాలు మంజూరు చేయాలి
దళిత హక్కుల పోరాట సంఘం నేతల డిమాండ్