
ప్రక్షాళనకు వేళాయే!
మరో సీఐపై కూడా వేటు...?
వేటుతో మొదలాయే..
● ఏడాదిన్నరగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జిల్లా పోలీసులు ● సీఐ, ఎస్సైల వ్యవహారశైలిపై నివేదికలు తెప్పించుకొని పరిశీలిస్తున్న ఎస్పీ హర్షవర్దన్ రాజు ● మహిళల ఫిర్యాదుతోనే పొదిలి సీఐ వెంకటేశ్వర్లుపై వేటు వేసినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం ● మరో సీఐపై కూడా వేటుకు రంగం సిద్ధం ● డ్రంక్ అండ్ డ్రైవ్ వసూళ్లపై సీరియస్ ● ఎస్బీ సిబ్బందిపైనా ఫిర్యాదుల వెల్లువ ● జిల్లాలో భారీగా పోలీసు శాఖ ప్రక్షాళన
జిల్లాలో కొంత మంది పోలీసు అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్ధన్‌రాజు వీటన్నింటిపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పొదిలి సీఐపై వేటు పడిందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కొత్త పోలీస్ బాస్ ప్రక్షాళన చేసే దిశగా అడుగలు వేస్తారా అన్నది అన్ని వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్బీలో పనిచేస్తున్న కొంత మంది సిబ్బంది వ్యవహారశైలి మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. పోలీసు శాఖ ఉద్యోగులుగా కాకుండా అధికారపార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. వారు చక్రం తిప్పి జిల్లాలో పలువురు పోలీసు సిబ్బందిని అటాచ్‌మెంట్ చేయించడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపుగా జిల్లాలో పనిచేస్తున్న అత్యధిక శాతం సీఐలు, ఎస్సైల మీద అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు శాఖలో సమగ్రమైన మార్పు తీసుకురావాలంటే చాలామంది వేటు వేయాల్సి వస్తుందని, అది సాధ్యమయ్యే పనేనా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు విమర్శలు వచ్చాయి. శాంతి భద్రతలను ఏమాత్రం పట్టించుకోకుండా గాలికొదిలేసినట్టు ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని పలు సర్కిల్ అధికారులపై, కింది స్థాయి సిబ్బంది అధికార పార్టీ నేతలు అండచూసుకుని రెచ్చిపోతున్నారని విమర్శలు ఉన్నాయి. గత నెల 14వ తేదీ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వి.హర్షవర్థన్ రాజు తనదైన శైలిలో పోలీసు శాఖలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పొదిలి సీఐ వెంకటేశ్వర్లును రేంజి వీఆర్‌కు పంపించడమే కాకుండా ఆఘమేఘాలపై కొత్త సీఐగా రాజేష్ బాధ్యతలను చేపట్టారు. ఇదే తరహాలో మరికొంత మందిపై వేటుపడనుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఒంగోలు రూరల్, తాలుకా పోలీసుస్టేషన్లకు కూతవేటు దూరంలో టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి అత్యంత దారుణంగా హత్యకు గురైన తర్వాత జరిగిన పరిణామాలతో అప్పటి తాలూకా సీఐపై మాత్రం వేటువేసి చేతులు దులుపుకున్నారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక ట్రాఫిక్ విభాగంపై లెక్కలేనన్ని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే మరో కీలక అధికారి వ్యవహారంపై కూడా పలు రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో కొత్త బాస్ ఒంగోలు నగరంపై ప్రత్యేక దృష్టిసారించినట్టు తెలుస్తోంది. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లపై రహస్యంగా నివేదిక తెప్పించుకుంటున్నట్టు తెలిసింది.
మహిళల ఫిర్యాదుతోనే పొదిలి సీఐపై వేటు...
పొదిలి సీఐ వెంకటేశ్వర్లు మీద తొలి నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి. అవినీతి అరోపణలు మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిగత వ్యవహారశైలి గురించి పలు ఆరోపణలు ఉన్నాయి. ఒంగోలు వన్‌టౌన్ సీఐగా పనిచేసిన సమయంలో వ్యక్తిగత సమస్య మీద పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వేధించడంపై పత్రికలలో కథనాలు వచ్చాయి. మార్టూరు టోల్ ప్లాజా వద్ద ప్రజలంతా చూస్తుండగానే మహిళను కొట్టడం సంచలనం సృష్టించింది. తాజాగా పొదిలి సీఐగా ఉన్న ఆయన పోలీస్‌స్టేషన్‌కు వచ్చే మహిళలను వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధిత మహిళలు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ..విషయాన్ని రేంజి ఐజీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో రాత్రికి రాత్రే ఆయన్ను వీఆర్‌కు పంపించడమే కాకుండా ఆయన స్థానంలో రాజేష్‌ను నియమించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యాపారంపై సీరియస్...
జిల్లా కేంద్రమైన ఒంగోలులో గత ఏడాదిన్నర కాలంగా ట్రాఫిక్ డీఎస్పీ లేకుండానే గడిచిపోయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనాల అసలు జరిమానా కంటే వారి వసూళ్లే అధికంగా ఉండేవని బాధితులు వాపోయారు. మోటారు బైకు దొరికితే అదనంగా రూ.10 వేలు, ఆటో, కార్లు వంటి వాహనాలు దొరికితే రూ.20 వేల వరకు వసూలు చేసేవారని ఆరోపణలు ఉన్నాయి.
కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా ..
జిల్లాలో కొందరు సీఐలు రాజకీయ నాయకులు మద్దతుతో రెచ్చిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. నగరంలోని ఒక ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే మహిళా ఉద్యోగినిని ఇద్దరు సహోద్యోగులు వేధిస్తున్నారన్న ఆరోపణలపై ఓ సీఐ కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా బేఖాతరు చేయలేదని ఆ మహిళా ఉద్యోగి ఆరోపిస్తున్నారు. గత సోమవారం సదరు మహిళ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ కేసు గురించి కూడా ఆయన సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఒక ఎస్‌ఐ తీరుపై కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
ఒంగోలు డెన్‌పై విమర్శల వెల్లువ...
నగరంలోని ఓ పోలీసు అధికారి అనధికార డెన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ ఏ నేరం జరిగినా డెన్‌కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా సింగిల్ నెంబర్ లాటరీ, గంజాయి కేసుల పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటీ యువకులను తీసుకొచ్చి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒంగోలు కేంద్రంగా పనిచేస్తున్న మరో సీఐపై కూడా ఇదే విధమైన ఫిర్యాదులొచ్చినట్టు సమాచారం. రెండు నెలల క్రితం సదరు సీఐ డిపార్టుమెంట్‌లో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని తీసుకొని వైజాగ్ విహారయాత్రకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న గత ఎస్పీ దామోదర్ సీఐకు క్లాస్ పీకడమే కాకుండా సదరు మహిళా ఉద్యోగినిపై బదిలీ వేటు వేసినట్లు సమాచారం. ఇక గ్రానైట్ టిప్పర్లు, ఇసుక లారీల నుంచి సైతం భారీగా వసూలు చేస్తున్నారని ఆయనపై వస్తున్న ఆరోపణల విషయంలో కూడా ఎస్పీ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.