
జ్వరాలకు భయపడాల్సిన అవసరం లేదు
● జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు
కురిచేడు: పస్తుత పరిస్థితుల్లో ఏ జ్వరమైనా భయపడాల్సిన పనిలేదని, అన్ని రకాల జ్వరాలకు వైద్యం అందుబాటులో ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు తెలిపారు. డెంగీతో విద్యార్థిని మృతిచెందిన కురిచేడు మండలంలోని ఎన్‌ఎస్‌పీ అగ్రహారం గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. గ్రామంలో నిర్వహిస్తున్న వైద్యశిబిరంతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. డెంగీ జ్వరంతో మరణించిన విద్యార్థిని కేసనపల్లి మధురవాణి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించకుంటే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని ఏఎన్‌ఎం వద్ద జ్వర పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. ఎవరికి ఏ జ్వరమొచ్చినా ఇష్టం వచ్చినట్లు మందులు వాడకుండా ఏఎన్‌ఎంలనుగానీ, లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోగానీ సంప్రదించాలని కోరారు. డెంగీ జ్వరానికి కూడా మందులున్నాయని, సకాలంలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే కచ్చితంగా తగ్గుతుందని అన్నారు. డెంగీ జ్వరం వచ్చిన 3 రోజుల తర్వాత పరీక్షలలో నిర్ధారణ జరుగుతుందన్నారు. రెండో రోజు డెంగీ పరీక్ష పాజిటివ్ రావడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రక్త పరీక్ష చేసిన ల్యాబ్‌ను, వైద్యచికిత్స అందించిన వైద్యశాలను తనిఖీ చేసి మధురవాణికి వాడిన మందుల గురించి తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థాయిని మించి వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని ఆర్‌ఎంపీలను హెచ్చరించారు. ప్రజలు సీజనల్ వ్యాదుల పట్ల అప్రమత్తంగా వుండాలని, ఏ అనుమానం వచ్చినా వెంటనే ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఎన్.మధుసూదనరావు, సిబ్బంది పాల్గొన్నారు.

జ్వరాలకు భయపడాల్సిన అవసరం లేదు