
అర్హత ఉన్న ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
ఒంగోలు: విచారణలో ఉన్న, అర్హత ఉన్న ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. బుధవారం విచారణలో ఉన్న ఖైదీల విషయాలపై స్థానిక తన చాంబరులో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయస్థానాల్లో తమ కేసులు నడిపించుకునేందుకు న్యాయవాదిని నియమించుకోలేని ప్రతి ఖైదీకి ఉచితంగా న్యాయవాదిని నియమించి వారికి న్యాయ సహాయం అందిస్తామన్నారు. రెవెన్యూశాఖ, పోలీసుశాఖ, జైళ్ల శాఖల అధికారులు సమన్వయంగా వ్యవహరించి చట్టపరంగా సమస్యలు పరిష్కారానికి విచారణ ఖైదీలకు సహకరించాలన్నారు. ఆర్‌డీవో సీహెచ్ ఓబులేసు, సీఐలు మల్లిఖార్జునరావు, దేవ ప్రభాకర్, జైలు శాఖ అధికారులు శ్రీనివాసరావు, యలమందరావు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.