
పొగాకు వేలం అడ్డగింత
కొండపి: ఒక్కసారిగా పొగాకు ధరలు దిగ్గోయడంపై రైతులు మండిపడ్డారు. ఇప్పటికే నష్టాల్లో ఉంటే మళ్లీ ధరలు తగ్గించడం ఏంటని రైతులు పొగాకు వేలాన్ని అడ్డుకున్నారు. ఈ సంఘటన బుధవారం కొండపి పొగాకు వేలం కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..క్లస్టర్ పరిధిలోని గుర్రప్పడియ, మూగచింతల, నెన్నూరుపాడు, చతుకుపాడు, కె.అగ్రహారం గ్రామాలకు చెందిన రైతులు వేలానికి వచ్చారు. అయితే వేలం ప్రారంభమైన కొద్ది సేపటికే కొన్ని రోజులుగా పెంచిన ధరలను ఒక్కసారిగా రూ.100 తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి వేలాన్ని అడ్డుకున్నారు. తమ క్లస్టర్ పరిధిలోకి వచ్చేసరికి ధరలు ఎందుకు తగ్గిస్తున్నారని వేలం నిర్వహణ అధికారి సునీల్‌కుమార్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం మార్కెట్ లేకపోవడంతో ధరలు తగ్గించారని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా..రైతులు ఒప్పుకోలేదు. రైతులందరి వద్ద ఒకే విధంగా కొనుగోలు చేయానే గానీ ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేస్తే కుదరదని చెప్పి వేలాన్ని బహిష్కరించారు. గరిష్ట ధర రూ.340లకు కొనుగోలు చేయాల్సిందేనని భీష్మించారు. దీంతో వేలం నిర్వహణాధికారి రైతులు, వ్యాపారులతో చర్చించి అదే ధరకు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి వేలం ప్రారంభమైంది.
పొగాకు కనిష్ట ధర రూ.90
స్థానిక పొగాకు వేలం కేంద్రంలో నిర్వహించిన వేలంలో పొగాకు కనిష్ట ధర రూ.90 పలికిందని వేలం నిర్వహణాధికారి జి.సునీల్‌కుమార్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని మూగచింతల గుర్రప్పడియ, నెన్నూరుపాడు, కె అగ్రహారం, చతుకుపాడు గ్రామాల చెందిన రైతులు 1214 బేళ్లను వేలానికి తీసుకురాగా 1146 బేళ్లను కొనుగోలు చేసి 68 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.330, సరాసరి ధర రూ.260.09గా నమోదైంది. వేలంలో 19 కంపెనీలు పాల్గొన్నాయి.
ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె
ఒక్కసారిగా ధరలు తగ్గించడంపై రైతుల మండిపాటు
వ్యాపారులతో చర్చల అనంతరం కొనసాగిన వేలం