
బాణసంచా కేంద్రాలపై ఆకస్మిక దాడులు
ఒంగోలు టౌన్: దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లాలోని బాణసంచా పరిశ్రమలు, గోడౌన్లు, విక్రయ కేంద్రాలపై బుధవారం పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. బాణసంచా విక్రయదారులు ఫైర్ అధికారుల నిబంధనలను అమలు చేస్తున్నారో లేదో పరిశీలించారు. షాపుల్లో అమర్చిన అగ్నిమాపక పరికరాలు పనిచేస్తున్నాయా లేదో పరిశీలించారు. ఊహించని విధంగా అగ్ని ప్రమాదం సంభవిస్తే మంటలు ఆర్పేందుకు సమీపంలో నీరు, ఇసుక అందుబాటులో ఉంచారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఫైర్ ఇంజన్ వెంటనే చేరుకునేందుకు తగిన స్థలం ఉందో లేదో చూశారు. బాణసంచా తయారీ కేంద్రాలలో కానీ, విక్రయ కేంద్రాలలో కానీ 18 ఏళ్ల లోపు పిల్లల చేత పనిచేయించరాదని సూచించారు. పోలీసు నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు హెచ్చరించారు.
1034 మందిపై బహిరంగ మద్యం కేసులు నమోదు..
గత నెలలో బహిరంగంగా మద్యం తాగుతున్న 1034 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు తెలిపారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 293 ప్రదేశాలను గుర్తించి అందులో 265 ప్రదేశాలను శుభ్రం చేయించినట్లు వివరించారు. గుడి, బడి పక్కన గుబురుగా ప్రదేశాలను శుభ్రం చేయించినట్లు చెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసినట్లవుతుందని చెప్పారు. ఎవరైనా బహిరంగంగా మద్యం సేవిస్తుంటే వెంటనే వీడియో తీసి పోలీసు వాట్సప్ నెంబర్ 9121102266 నంబర్‌కు పంపించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఎంఎస్‌సీడీ ద్వారా నిందితుల గుర్తింపు..
శాంతి భద్రతలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు రాత్రి గస్తీ నిర్వహించడమే కాకుండా మొబైల్ సెక్యురిటీ చెక్డ్ డివైజ్ (ఎంఎస్‌సీడి) అనే అత్యంత ఆధునిక పరికరం ద్వారా అనుమానిత వ్యక్తుల వేలి ముద్రలను సేకరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ పరికరం ద్వారా పోలీసులు ఒక వ్యక్తి నుంచి సేకరించిన వేలిముద్రలను అక్కడిక్కడే స్కాన్ చేసి అతడి నేరచరిత్రను గుర్తించవచ్చన్నారు. గత నెలలో 4494 మంది వేలిముద్రలు సేకరించగా వారిలో 15 మంది నిందితులను గుర్తించామని, తనిఖీల్లో ఒంగోలుకు చెందిన షేక్ రఫీ అనే నిందితుడు 12 కేసుల్లో ఉన్నట్లు గుర్తించి వెంటనే అతడిని సంబంధిత పోలీసు స్టేషన్లలో బైండోవర్ చేసినట్లు తెలిపారు. నేరాలు ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉన్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి ప్రాంతాల్లో వాహన తనిఖీలు, కొత్తగా వచ్చిన వారి పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు.
నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు
ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరిక

బాణసంచా కేంద్రాలపై ఆకస్మిక దాడులు