ఖాకీ చెలరేగుతూ! | - | Sakshi
Sakshi News home page

ఖాకీ చెలరేగుతూ!

Sep 20 2025 6:40 AM | Updated on Sep 20 2025 6:40 AM

ఖాకీ

ఖాకీ చెలరేగుతూ!

ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా అడుగడుగునా ఆంక్షలు పోలీసు యాక్ట్‌ 30 పేరుతో వైఎస్సార్‌ సీపీ నేతలకు నోటీసులు ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజలకు కనిపించకుండా ఆపసోపాలు వెన్నుపోటు దినం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, అన్నదాతకు అండగా ర్యాలీలు చేయకుండా ఆటంకాలు తాజాగా మెడికల్‌ కాలేజీల వద్దకు వెళ్లకుండా అర్ధరాత్రి నోటీసులు

ఖద్దరు ఆడిస్తూ..

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్ష పార్టీల నేతలపై పోలీసుల ఆంక్షలు ఎక్కువయ్యాయి. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడకుండా ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. స్వామి భక్తిని నిరూపించుకునేందుకు పోలీసులు అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు లాఠీలు ఝళిపిస్తున్నారు. ప్రజలకు అండగా నిలిచిన ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ నాయకులు, ప్రజా సంఘాల నాయకుల మీద కేసులు బనాయిస్తున్నారు. నోటీసులు ఇస్తూ ప్రజాందోళన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. డ్రోన్‌ కెమెరాలను ఎగరేసి పార్టీ నాయకులను బెదిరించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. చివరికి ప్రజాస్వామ్యయుతంగా ర్యాలీలు చేసేందుకు కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. రైతు సమస్యలపై ఆర్డీఓకు వినతి పత్రం ఇవ్వడం కూడా నేరమైపోతోంది. వినాయక చవితి పండుగను కూడా రాజకీయం చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైఎస్సార్‌ సీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించే పండుగలపై ఆంక్షలు విధించడమే కాకుండా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. దీనిపై అభ్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ప్రతిపక్షంపై పోలీసు కన్ను...

ఏడాదిన్నర క్రితం చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిందే తడువుగా ప్రజా వ్యతిరేక విధానలకు తెరదీసింది. ప్రజల పక్షం నిలబడి పోరాటాలు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చింది. ఏడాది కాలంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకపోవడంతో వైఎస్సార్‌ సీపీ యువత పోరుకు పిలుపునిచ్చింది. అప్పటికై నా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందనుకుంటే అందుకు బదులుగా పోరాటాన్ని అణిచివేసేందుకు పోలీసులను రంగంలోకి దించింది. అంతేకాకుండా పెరిగిన కరెంటు చార్జీలకు వ్యతిరేకంగా రైతు పోరు నిర్వహించింది. ఇమాంలు, మౌజన్లకు గౌరవ వేతనం చెల్లించాలని వైఎస్సార్‌ సీపీ మైనార్టీ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వెన్నుపోటు దినం పేరుతో నిరసనలు చేపట్టారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ అన్నదాత పోరు పేరుతో జిల్లాలోని ఆర్డీఓలకు వినతి పత్రం అందజేశారు. తాజాగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నిర్మించిన మెడికల్‌ కళాశాలలను పీపీపీ ముసుగులో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ చలో మెడికల్‌ కాలేజీలకు వైఎస్సార్‌ సీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైఎస్సార్‌ సీపీ ఏ ఉద్యమం చేపట్టినా కూటమి ప్రభుత్వం అడ్డుకునేందుకు పోలీసులను రంగంలోకి దించడం ఆనవాయితీగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పోలీసు యాక్ట్‌ పేరుతో నోటీసులు...

ప్రజా సమస్యలపై వైఎస్సార్‌ సీపీ చేస్తున్న పోరాటాలను అడ్డుకునేందుకు పోలీసు యాక్ట్‌ 30ను ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి లేదని చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ చేపట్టే పోరాటాలకు అనుమతులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు. తీరా అనుమతులు ఇచ్చిన తరువాత కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పొగాకు సమస్యపై జిల్లాకు చెందిన రైతులతో మాట్లాడేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పొదిలి పర్యటనకు వచ్చినప్పుడు కూడా పోలీసులు ఇదే తీరులో వ్యవహరించారు. పోలీసుల అనుమతి తీసుకొని పర్యటనకు వచ్చినప్పటికీ ర్యాలీలో పాల్గొన్న రైతులు, పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్టు చేసి వేధింపులకు పాల్పడ్డారు. తాజాగా చలో మెడికల్‌ కాలేజీ కార్యక్రమానికి నాయకులు వెళ్లకుండా నోటీసులు ఇచ్చారు. అర్ధరాత్రి నాయకుల ఇంటికి వెళ్లి నోటీసులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. శాంతియుతంగా నిర్వహించే కార్యక్రమాలకు కూడా నోటీసులు ఇవ్వడంపై ప్రజా సంఘాల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వినాయక చవితి పండుగపై ఆంక్షలు...

వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఊరిలో, పట్టణాల్లోని ప్రధాన వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసి వినాయకుడి పూజలు నిర్వహిస్తుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వినాయక చవితి పండగను కూడా రాజకీయం చేసేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన మండపాలకు ఒక రూలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన భక్తులు ఏర్పాటు చేసుకున్న మండపాలకు మరొక రూలు విధించి ఇబ్బందులకు గురిచేయడం ఆనవాయితీగా వస్తోంది. చివరికి నిమజ్జనం ఊరేగింపులు కూడా తొలుత టీడీపీ నాయకులు చేసుకోవాలని, తరువాతే వైఎస్సార్‌ సీపీ నాయకులు చేయాలని షరతులు విధిస్తున్నారు. దీంతో గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఒంగోలు నగరంలోని 45వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం ఊరేగింపును అడుగడుగునా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటను సాకుగా చూపి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల మీద కేసులు బనాయించి రిమాండ్‌కు పంపించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇందులో ఒక మైనర్‌పై కూడా కేసు నమోదు చేయడమే కాకుండా రిమాండ్‌కు పంపించారు.

ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్థతను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు చేయని కుతంత్రాలు లేవు. ప్రజల పక్షాన నిలబడి వైఎస్సార్‌ సీపీ చేపట్టే కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పుతోంది. పాలకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన ఖాకీలు రకరకాల ఆంక్షలు విధిస్తూ నోటీసులు ఇస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా ఇంటి తలుపు తట్టి నోటీసులు ఇస్తూ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజాందోళన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పాలకులు అమలు చేస్తున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని, ఆంక్షలను దాటి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన నిలుస్తూ ఆందోళనలు చేస్తున్నారు.

ఖాకీ చెలరేగుతూ!1
1/1

ఖాకీ చెలరేగుతూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement