
వచ్చే ఆగస్టు నాటికి వెలుగొండ పూర్తి
● కలెక్టర్ రాజాబాబు
● అధికారులతో కలిసి వెలుగొండ ప్రాజెక్టు
సొరంగ నిర్మాణాల పరిశీలన
పెద్దదోర్నాల: జిల్లా జీవనాడి అయిన పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న సొరంగ నిర్మాణ పనులను శుక్రవారం అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. గంటవానిపల్లె చెరువు వద్ద కాలువ పనులను, తీగలేరు వాగును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు అతిథి గృహంలో ప్రాజెక్టు ఇంజినీరింగ్, భూసేకరణ అధికారులు, ప్రాజెక్టు నిర్మాణ ప్రతినిధులతో సమావేశమై ప్రాజెక్టు పురోగతి, పునరావాస కార్యక్రమాల అమలు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే మొదటి సొరంగం పనులు పూర్తయ్యాయని ఇంజినీరింగ్ అధికారులు ఆయనకు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం వలన తాగు, సాగు నీటి ప్రయోజనాలు ఇతర వివరాలను ప్రాజెక్టు ఎస్‌ఈ అబూతాలింను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కల్టెకర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రెండో సొరంగం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. పనులు త్వరగా పూర్తయ్యేలా మరింత దృష్టి సారించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాస కాలనీల కోసం అవసరమైన ల్యాండ్ డెవలప్‌మెంట్ పనులు పూర్తయ్యాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు, ముంపు గ్రామాల ప్రజల తరలింపును వచ్చే ఆగస్టు నాటికి పూర్తయ్యేలా చూస్తున్నామన్నారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట సహదిత్ త్రివినాథ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, సీతారామిరెడ్డి, ఉన్నారు.