
శ్మశానానికి స్థలం చూపించాలని నిరసన
పొన్నలూరు: తమ గ్రామానికి అధికారులు, ప్రభుత్వం శ్మశాన స్థలం చూపించాలంటూ మృతదేహంతో నిరసన తెలిపారు. ఈ సంఘటన పొన్నలూరు మండలం మాలపాడు పంచాయతీ చెంచుపాలెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుదే పోలయ్య (75) అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. గ్రామంలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి ఆయన గుర్తుగా సమాధి నిర్మించుకోవాలని కుటుంబ సభ్యులు భావించారు. గ్రామంలో కొన్నేళ్లుగా అనువైన శ్మశాన స్థలం లేకపోవడంతో గ్రామస్తులు చేసేదిలేక గ్రామానికి సమీపంలో ఉన్న గొరెశల వాగులో కొంత మందికి దహన సంస్కారాలు, మరికొంత మందిని ఖననం చేస్తూ వస్తున్నారు. ఇలా గ్రామానికి సరైన శ్మశానం స్థలం లేకపోవడంతో గ్రామంలో ఎవరైనా మరణించినప్పుడు వారి అంత్యక్రియలు చేయడానికి నానా అగచాట్లు పడుతున్నారు. అలాగే మరణించిన వారి గుర్తుగా సమాధి నిర్మించుకోవాలంటే గొరెశల వాగులో కాకుండా వారి సొంత స్థలాల్లో అంత్యక్రియలు చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో గ్రామంలోని గుదే పోలయ్య అనారోగ్యంతో మరణించడంతో పాటు ఆయనికి సంతానం లేకపోవడంతో అతని బంధువైన గుదే నాగరాజు అంత్యక్రియలు బాధ్యత తీసుకుని సమాధి నిర్మించడానికి పూనుకున్నాడు. అయితే, తమ గ్రామానికి అనువైన శ్మశాన స్థలం లేదని, ఎవరైనా గ్రామస్తులు మరణిస్తే వాగులో దహన సంస్కారాలు చేయాల్సి వస్తోందని, అధికారులతో పాటు ప్రభుత్వం స్పందించి శ్మశాన స్థలం చూపించకపోతే తన పెద్దనాన్న అయిన పోలయ్యను గ్రామంలోని ఇళ్ల మధ్య ఖననం చేయడానికి అనుమతివ్వాలని జిల్లా నుంచి మండల స్థాయి అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చివరికి సొంత స్థలంలోనే అంత్యక్రియలు...
ఇదిలా ఉంటే పోలయ్య ఖననం విషయంలో స్పందించిన అధికారులు గ్రామ సమీపంలో ఉన్న గొరెశల వాగు పక్కనే ఉన్న వాగుబోరంబోకు భూమిని గ్రామస్తులు శ్మశానంగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. పోలయ్యను కూడా గ్రామంలోని ఇళ్ల మధ్య కాకుండా శ్మశాన స్థలంలో ఖననం చేయాలని సూచించారు. దీనికి నిరాకరించిన పోలయ్య కుటుంబ సభ్యులు వాగులో ఎలా ఖననం చేస్తారని, అలాగే సమాధి ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పాటు గ్రామస్తుల నుంచి ఎలాంటి ఆటంకం ఏర్పడకపోవడంతో చివరికి నివాస గృహాల సమీపంలోని తమ సొంత స్థలంలోనే ఖననం చేశారు. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం స్పందించి గ్రామస్తులకు అనువైన శ్మశాన స్థలం కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పొన్నలూరు మండలం చెంచుపాలెం గ్రామంలో ఆందోళన
తన పెద్దనాన్న మృతదేహంతో నిరసన తెలిపిన గ్రామస్తుడు నాగరాజు
శ్మశాన స్థలం ఎక్కడో చూపించాలంటూ అధికారులకు వేడుకోలు
చేసేదిలేక గ్రామ సమీపంలోని సొంత స్థలంలో మృతదేహానికి అంత్యక్రియలు

శ్మశానానికి స్థలం చూపించాలని నిరసన