
శాంతిభద్రతల్లో నిర్లక్ష్యం.. సివిల్ సెటిల్మెంట్లు ‘బ్ర
తర్లుపాడు:
రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీస్ వ్యవస్థ తీరు సరిగా లేదని మరింత మెరుగుపడాలని రెండు రోజుల క్రితం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. సీఎం మాటలు ఏమాత్రం అవాస్తవం కాదని తర్లుపాడు మండల పోలీసులు నిరూపించారు. వివరాల్లోకి వెళ్తే.. తర్లుపాడు మండలం కలుజువ్వలపాడుకు చెందిన మహిళ భాగ్యలక్ష్మిని ఆమె భర్త తాళ్లతో కట్టేసి విచక్షణా రహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందస్తు ఫిర్యాదు అందినప్పటికీ వీడియో వెలుగులోకి వచ్చేదాక పోలీసులు కనీస చర్యలు తీసుకోలేదు. ఏం జరిగిందో కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. గత శనివారం రాత్రి భర్త తాళ్లతో నిర్భంధించి భాగ్యలక్ష్మిని హింసించాడు. సోమవారం రాత్రి మరో మారు అపహరించి హింసించేందుకు భాగ్యలక్ష్మి నివశిస్తున్న ఇంటివద్దకు రాగా వారిని గమనించిన ఆమె తప్పించుకుని పక్కనే ఉన్న ఎస్సీకాలనీలోని పరిగెత్తింది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే కొందరు యువకులు బాలాజీని హెచ్చరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె ఆవేదనను తెలుసుకున్న స్థానిక ప్రజా ప్రతినిధి తర్లుపాడు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఎంతసేపటికీ వారు రాకపోవడంతో చర్చి వద్ద ఉన్న కొందరు యువకులు ఏం జరిగిందంటూ బాధిత మహిళను ఆరా తీశారు. తన భర్త చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని, నా పిల్లలు అనాథలైపోతారని ఆ మహిళ కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో ఆ యువకులు డయల్ 112కు సమచారం అందించారు. రాత్రి 11 గంటల సమయంలో తర్లుపాడు పోలీసుస్టేషన్‌నుంచి వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లు మహిళతో మాట్లాడి ఫొటో దిగి బాలాజీ మేనల్లుడు విష్ణును బైక్‌పై ఎక్కించుకుని కొంత దూరం తీసుకెళ్లి వదిలేశారు. ఓ మహిళపై క్రూరంగా దాడి చేసినప్పటికీ మరుసటిరోజు ఉదయం కూడా దృష్టి సారించలేదు. పైశాచిక ఆనందం పొందేందుకు బాలాజీ మరో భార్యగా చెబుతున్న మహిళ తీసుకున్న వీడియో మంగళవారం సాయంత్రం బయటకు రావడంతో వాస్తవాలు వెలుగుచూశాయి. భాగ్యలక్ష్మిపై జరిగిన హింసను వీడియోలో చూసిన వారంతా ఆవేదనకు గురయ్యారు.
తర్లుపాడు ఠాణా.. భరోసా దక్కేనా?
గత కొంతకాలంగా తర్లుపాడు పోలీసుస్టేషన్ సివిల్ పంచాయితీలకు అడ్డాగా మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుదారులతో సిబ్బంది సైతం అమర్యాదగా మాట్లాడుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. మండలంలోని రాగసముద్రం గ్రామంలో ఓ సివిల్ కేసులో ఎస్సై తలదూర్చి బాధితులను బెదిరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించి న్యాయం పొందారు. జగన్నాథపురంలో పలు సివిల్ కేసుల్లో ఎస్సై తలదూర్చి బాధితులను బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. మీర్జపేటలో ఎస్సీ యువకుడిపై దాడి ఘటనలో బాధితులపైనే కేసు పెడతాననడంతో ఖంగుతిన్న యువకులు కేసు విత్‌డ్రా చేసుకోగా.. దాడికి పాల్పడిన వారి నుంచి లబ్ధి పొందారనే ఆరోపణలు ఉన్నాయి. వినాయకచవితి సందర్భంగా యాదవ బజారులో యువకుల మధ్య జరిగిన గొడవలో బాధితులకు న్యాయం జరగలేదన్న చర్చ నడుస్తోంది. వీటికి తోడు పలు కుటుంబ గొడవల్లో స్టేషన్‌కు వచ్చిన బాధితులకు న్యాయం దక్కకపోవడంతో పోలీసుస్టేషన్ ఛాయలకు వచ్చేందుకు బాధితులు భయపడుతున్నారు. ఉన్నతాదికారుల పర్యవేక్షణ కూడా అంతంతమాత్రంగా ఉండటంతో స్టేషన్ సిబ్బంది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది.