
‘జాళ్లపాలెం ఘటన’ తదుపరి చర్యలపై హైకోర్టు స్టే
కొండపి: మండలంలోని పెద్ద కండ్లకుంట పంచాయతీ జాళ్లపాలెం గ్రామంలో 20 ఏళ్ల క్రితం నిర్మించిన రచ్చబండను, 30 ఏళ్ల నుంచి ఉన్న చెట్టు, మంచినీటి బోరింగ్‌ను టీడీపీ సానుభూతిపరుల ప్రోద్బలంతో, పోలీసుల సహకారంతో కూల్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు పోలీసులను ప్రశ్నించగా అక్రమ కేసులు బనాయించారు. ఈ కేసులపై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ స్టే విధించినట్లు సర్పంచ్ భువనగిరి సత్యనారాయణ తెలిపారు. బాధితుల పక్షాన నిలిచి, కేసులపై న్యాయ పోరాటం చేసి, అక్రమ కేసులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్‌కు, సర్పంచ్ భువనగిరి సత్యనారాయణకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
కంభం: ఎస్‌బీఐలో ఓ వ్యక్తి నగదు డిపాజిట్ చేస్తున్న సమయంలో దొంగనోట్లను గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అందిన వివరాల మేరకు.. ఈనెల 2వ తేదీ సాయంత్రం సుబ్బారావు అనే వ్యక్తి కంభం ఎస్‌బీఐలో రూ.43,500 డిపాజిట్ చేసేందుకు కౌంటర్‌లో నగదు ఇవ్వగా అందులో 21 ఐదు వందల రూపాయల(రూ.20,500 నగదు) నోట్లు గుర్తించారు. సిబ్బంది బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన అనంతరం వారి సూచనల మేరకు కంభం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై కంభం ఎస్సై నరసింహారావును వివరణ కోరగా బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన వ్యక్తి ఆ నగదును తనకు మరో వ్యక్తి ఇచ్చిన డబ్బులని చెబుతున్న నేపథ్యంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నట్లు సమాచారం.
పెద్దదోర్నాల: బైక్ అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు కర్నూలులోనిఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బుధవారం శ్రీశైలం ఘాట్ రోడ్డులో సంభవించిన ప్రమాదంలో నందికొట్కూర్‌కు చెందిన రాకేష్ తీవ్రంగా గాయపడిన విషయం పాఠకులకు విధితమే. రాకేష్‌కు దోర్నాల వైధ్యశాలలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో కర్నూలు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రాకేష్ బుధవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు ఆయన బంధువులు తెలిపారు. మృతుడు కర్నూలు జిల్లా నందికొట్కూర్‌లో ప్రైవేట్ స్కూల్ వ్యాన్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అర్ధవీడు: మండలంలోని పలు గ్రామాల్లో ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసి 19 మందిని కరిచి గాయపరిచింది. అర్ధవీడు, దొనకొండ, చీమలేటిపల్లి, వీరభద్రాపురం గ్రామాల్లో బుధవారం రాత్రి నుంచి తిరుగుతున్న పిచ్చికుక్క కనిపించిన వారినందరినీ కసిగా కరిచింది. క్షతగాత్రులు అర్ధవీడు పీహెచ్‌సీతోపాటు కంభంలోని ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లి చికిత్స పొందారు. వీధి కుక్కల బెడదను కట్టడి చేసేందుకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఒంగోలు: సెపక్ తక్రా జిల్లా జట్లఎంపిక పోటీలు ఈనెల 21న సాయంత్రం 3 గంటలకు స్థానిక ఏబీఎం కాలేజీ మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి డి.రవిప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్స్ పురుషులు, మహిళల విభాగంలో ఎంపిక పోటీలకు ఆసక్తి ఉన్న వారు హాజరుకావాలని సూచించారు. ఎంపికై న జట్లు ఈ నెల 27, 28వ తేదీల్లో ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 9381657774ను సంప్రదించాలని సూచించారు.
ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లా వాలీబాల్ సబ్ జూనియర్, జూనియర్ బాలుర ప్రాబబుల్స్ జట్లను ఈనెల 21న స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేయనున్నట్లు వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ ఎం.ఆంజనేయులు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ వయస్సు ధ్రువీకరణ పత్రంతో ఎంపిక ప్రదేశంలో హాజరుకావాలని స్పష్టం చేశారు. వివరాలకు 9490196274ను సంప్రదించాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు.