
సాంకేతికతతోనే సైబర్ నేరాలకు చెక్
● ఎస్పీ వి.హర్షవర్థన్‌రాజు
ఒంగోలు టౌన్: సోషల్ మీడియాకు సంబంధిచిన విషయాలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలను సాంకేతికత సహాయంతో ఛేదించాలని ఎస్పీ వి.హర్షవర్థన్‌రాజు ఆదేశించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చన్నారు. గురువారం పోలీసు ఐటీ కోర్, కంట్రోల్ రూం సెంటర్లను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం అందించేందుకు ఐటీ కోర్ కృషి చేయాలన్నారు. కంట్రోలు రూంలో విధులు నిర్వహిస్తున్న డయల్ 112 సిబ్బంది అంకితభావంతో చురుగ్గా పనిచేయాలన్నారు. పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి దర్యాప్తునకు ఉపయోగపడే కీలక ఆధారాలను త్వరితగతిన అందించాలని స్పష్టం చేశారు. ఎస్పీ వెంట ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, సిబ్బంది ఉన్నారు.
ఉలవపాడు: ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితుడికి కోర్టు శిక్ష విధించింది. మండల పరిధిలో 2020లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితుడికి ఒంగోలు ఏడో ఏడీజే కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.12 వేల జరిమానా విధించినట్లు కందుకూరు సీఐ అన్వర్ బాషా తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మండల పరిధిలోని ఓ ఎస్టీ మహిళ గేదెల మేత కోసం గట్టు మీద వెళ్తున్న సమయంలో కరేడుకు చెందిన నక్కా రమేష్ తన పొలం దగ్గరకు ఎందుకు తీసుకువస్తున్నావని ప్రశ్నించాడు. దీంతో ఆమె గట్టు మీద కదా వెళ్తున్నా అని సమాధానం చెప్పింది. అయితే రమేష్ ఆమెను కులం పేరుతో దూషిస్తూ చీరపట్టుకుని లాగి చెంపపై కొట్టి పంట కాల్వలో పడేశాడు. స్థానికుల సాయంతో ఆమె పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం జడ్జి రాజా వెంకటాద్రి తుదితీర్పు వెల్లడించారు. నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.12 వేల జరిమానా విధించారు.
● జీజీహెచ్‌లో ఆలస్యంగా స్పందించిన అంబులెన్స్ సిబ్బంది
మార్కాపురం: ఒక వివాదంలో మహిళలు తనపై దాడి చేశారని మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం రాత్రి మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన గుట్టమల్ల శివ ఒక వివాదానికి కారణమయ్యాడని మహిళలు దాడి చేశారు. దీంతో శివ మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు గుర్తించి హుటాహుటిన మార్కాపురం జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు వెళ్లాలని సూచించారు. అయితే జీజీహెచ్‌లో అంబులెన్స్ ఉన్నప్పటికీ దోర్నాల నుంచి అంబులెన్స్ రావాలని కాలయాపన చేయడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు శివను రాత్రి 10 గంటల సమయంలో అంబులెన్స్‌లో ఒంగోలు తరలించారు.