
ఉపాధ్యాయుల పరిస్థితి మరింత ఘోరం
ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ మంజుల
ఒంగోలు టౌన్: కూటమి పాలనలో ఉపాధ్యాయుల పరిస్థితి మరింత ఘోరంగా తయారైందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ మంజుల చెప్పారు. ఏపీటీఎఫ్ పిలుపు మేరకు మంగళవారం ప్రకాశం భవనం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంజుల మాట్లాడుతూ పరీక్షలు, ప్రశ్న పత్రాలను అశాసీ్త్రయ పద్ధతిలో ముద్రించి పంపిస్తున్నారని తెలిపారు. ఈ విధానం ఉపాధ్యాయుల్లో మరింత గందరగోళానికి దారి తీస్తోందని విమర్శించారు. ఇలాంటి ధోరణిని విడనాడాలని ప్రభుత్వానికి సూచించారు. 12వ పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ ప్రకటిచాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పత్రిక సంపాదకుడు ఎస్.గురునాథ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పద్ధతి మానుకోవాలని హితవుపలికారు. రాష్ట్ర మాజీ కార్యదర్శి విజయ సారధి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే ఏకై క మార్గమని స్పష్టం చేశారు. జిల్లా శాఖ కార్యదర్శి షేక్.నాయబ్ రసూల్ మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెమో 57ను తక్షణమే అమలు చేయాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ అసెస్‌మెంట్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు రావాల్సిన అన్నీ రకాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నాయకురాలు షేక్.బషీరున్నిసా డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో బి.శేషారావు, శేఖర్ రెడ్డి, టి.సుబ్బారావు, షేక్.ఖాదర్ బాషా, యేసుదాసు, వీరరాఘవులు, మౌలాలి, హరిబాబు, ఈశ్వరయ్య, సీహెచ్ మస్తాన్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు.