
విద్యుత్ అధికారుల తీరుపై సీఎండీ అసంతృప్తి
స్వప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు సకాలంలో ఇవ్వడం లేదని మండిపాటు విద్యుత్ శాఖ జిల్లా అధికారులతో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి సమీక్ష
ఒంగోలు సబర్బన్: విద్యుత్ శాఖ అధికారుల తీరుపై ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కింది స్థాయి నుంచి ఈఈ స్థాయి అధికారి వరకు కొందరు సంస్థ ప్రయోజనాల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వడంలో కాకి లెక్కలు చెబుతున్నారని కొందరు అధికారులపై మండిపడ్డారు. ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పీ.పుల్లారెడ్డి స్థానిక విద్యుత్ భవన్‌లో మంగళవారం జిల్లా విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాల ముఖ్య పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆర్డీఎస్‌ఎస్, పీఎం సూర్య ఘర్ పురోగతి మీద, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరుపై సమీక్షించారు. విద్యుత్ శాఖ మీద ప్రజల అభిప్రాయం విషయంలో చాలా అసంతృప్తిగా ఉందని, అందుకు సంస్థలోని కొందరి అధికారుల పనితీరే ప్రధాన కారణమన్నారు. విద్యుత్ కలెక్షన్లు ఇచ్చే విషయంలో కూడా సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. బకాయిల విషయంలో అధికారులు సక్రమంగా వ్యవహరించటం లేదన్నారు. ఆర్డీఎస్‌ఎస్ పనులు వేగవంతం చేయాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో అధికారులు ఎవరూ నిర్లక్ష్యం వహించకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు అధికంగా ఏర్పాటు చేయడం కోసం ప్రతి ఒక విద్యుత్ అధికారికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. ఫీడర్ పెట్రోలింగ్ చేసి లోపాలను సరి చేయాలన్నారు. ప్రజలకు స్మార్ట్ మీటర్లు పట్ల ఉన్న అపోహలను తొలగించాలన్నారు. కార్యక్రమంలో ఏపీ సీపీడీసీఎల్ డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్, జిల్లా ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లుతో పాటు ఒంగోలు ఈఈ హరిబాబు, డీఈఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.