
నకిలీ వలలో గెలగిల!
త్రిపురాంతకం మండలంలో నిండా మునిగిన అరటి రైతులు
త్రిపురాంతకం:
అరటి సాగు చేసిన రైతుల ఆశలు ఆవిరైపోయాయి. నకిలీ కాటుకు రైతులు ఆర్థికంగా బలయ్యారు. అరటి చెట్లు ఏపుగా పెరిగినా దిగుబడి రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. త్రిపురాంతకం మండలంలో రైతులు గత ఏడాది కాలంగా అరటి తోటలు విస్తారంగా సాగు చేస్తున్నారు. గతంలో మిరప, వరి, ఇతర పంటలను సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అరటి సాగుపై దృష్టి సారించారు. మండలంలో సుమారు 150 ఎకరాల వరకు అరటి తోటలు సాగవుతుండగా ముందస్తుగా నాటిన తోటలు కాపుదశకు చేరుకున్నాయి. ఏపుగా పెరిగిన అరటి చెట్లను చూసి ఆనందించిన రైతులు.. రోజులు గడుస్తున్నా అరటి గెలలు కాయకపోతుండటంతో ఆందోళనకు గురయ్యారు. సోమేపల్లి, శ్రీనివాసనగర్, మిరియంపల్లి, వెల్లంపల్లి గ్రామాల్లో సాగు చేసిన 15 ఎకరాల తోటల్లో ఒకటీ అరా గెలలు తప్ప పూర్తి స్థాయిలో కాపు రాలేదు. పంట చేతికొస్తే పెట్టుబడి సొమ్ము రూ.2 లక్షలకు పైగా పోను ఎకరాకు కనీసం రూ.2 లక్షల లాభం వస్తుందని ఆశించిన రైతులు.. ప్రస్తుత పరిస్థితి చూసి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అరటికి ఈ క్రాప్ చేయించామని, పంట నష్ట పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎకరాకు రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి
ఒక్కో అరటి మొక్కను రూ.12 నుంచి రూ.15 వరకు వెచ్చించి కొనుగోలు చేసిన రైతులు ఎకరాకు 1200 నుంచి 1400 మొక్కలు నాటారు. మొక్కలకు అవసరమైన గెడలు, సేద్యం ఖర్చులు, ఎరువులు, కూలీల ఖర్చు ఇలా మొత్తం రూ.2.50 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. దిగుబడి రాకపోవడంతో పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట రాకపోతే నేనేం చేస్తా?
పది నెలల క్రితం సాగు చేసిన అరటి మొక్కలు ప్రస్తుతం 12 అడుగుల వరకు పెరిగాయి. గెలలు వస్తాయని ఎదురుచూస్తున్న రైతులు ఇటీవల అనుమానం రావడంతో ఉద్యానశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తోటలను పరిశీలించిన అధికారులు అరటి మొక్కలకు కాపురాదని చెప్పడంతో రైతులు విస్తుపోయారు. ‘నర్సరీ యజమాని మంచి కాపు వస్తుందని చెప్పడంతో వాటిని ఎంపిక చేసుకుని అందించా. ఫలసాయం రాకపోతే నేనేం చేస్తా’ అని దళారి మాట దాటవేస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు.
సుమారు 150 ఎకరాల్లో అరటి సాగు
తోటలు ఏపుగా పెరిగినా దిగుబడి రాకపోవడంతో ఆందోళన
ఎకరాకు రూ.3 లక్షలు నష్టపోయామని రైతుల ఆవేదన
మొక్కలు విక్రయించిన దళారి చేతులెత్తేసిన వైనం
నష్టపరిహారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

నకిలీ వలలో గెలగిల!

నకిలీ వలలో గెలగిల!

నకిలీ వలలో గెలగిల!

నకిలీ వలలో గెలగిల!