
మద్యం మత్తులో బీర్‌బాటిల్‌తో దాడి
ఒంగోలు టౌన్: పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి మరో యువకుడిపై బీట్ బాటిల్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం ఒంగోలు నగరంలోని కల్యాణి బార్ అండ్ రెస్టారెంట్‌లో చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పెళ్లూరుకు చెందిన కోణంకి అయ్యప్ప శుక్రవారం ఉదయం 9 గంటల సమయానికి మద్యం సేవించేందుకు నగరంలోని నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని కళ్యాణి బార్ అండ్ రెస్టారెంట్‌కు వచ్చాడు. అప్పటికే బార్‌లో నగరంలోని భాగ్యనగర్‌కు చెందిన షేక్ అనిల్ మద్యం తాగుతున్నాడు. పూటుగా తాగిన మత్తులో ఉన్న అనిల్ విచక్షణ కోల్పోయాడు. చేతిలోని బీర్ బాటిల్ పగలగొట్టి పక్కన గున్న అయ్యప్ప మీద దాడి చేశాడు. అయ్యప్పకు గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు. భార్యతో మనస్పర్ధల కారణంగా గత కొంతకాలంగా అనిల్ చిత్తుగా తాగి తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇంకొల్లు(చినగంజాం): ఇంకొల్లు– పావులూరు రోడ్డులో నాగులు చెరువు కట్టపై ఉన్న సుమారు వందేళ్ల నాటి భారీ మర్రి చెట్టు కొమ్మలు శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా విరిగి పడ్డాయి. ఆ సమయంలో అక్కడ జన సంచారం లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై చెట్టు కొమ్మలు విరిగి పడటంతో సాయంత్రం మూడు గంటల నుంచి ట్రాఫిక్ స్తంభించింది. పంచాయతీ కార్యదర్శి అడ్డగడ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చెట్టు కొమ్మలను తొలగించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.