
అన్నీ ఏకపక్ష తీర్మానాలే
స్టాండింగ్ కమిటీ లేకుండా మేయర్‌తో రూ.కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం మొక్కుబడిగా కౌన్సిల్‌లో పెట్టిన పాలకమండలి అడుగడుగునా అడ్డుతగిలిన వైఎస్సార్ సీపీ సభ్యులు ట్రంకు రోడ్డు, బరియల్ గ్రౌండ్ అంశాలపై వైఎస్సార్ సీపీ సభ్యుల నిరసన యాదవ భవన్ విషయంలో మాటమార్చిన ఎమ్మెల్యే ‘సాక్షి’ కథనంపై ఎమ్మెల్యే అక్కసు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో అన్నీ ఏకపక్ష తీర్మానాలే జరిగిపోయాయి. ప్రజా వ్యతిరేక తీర్మానాలపై వైఎస్సార్ సీపీ సభ్యులు అడుగడుగునా అడ్డుతగిలినా చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లుగా ఉంది తప్ప ప్రజలకు మేలు చేద్దామన్న ఆలోచనే కూటమి సభ్యులు చేయలేదు. శుక్రవారం ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ సమావేశం ఇన్‌చార్జ్ మేయర్ వేమూరి సూర్య నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో 64 అంశాలను ఆమోదానికి పెట్టారు. వాటిలో సగానికి పైగా ముందస్తు అనుమతులుగా పెట్టుకున్నవే. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయకుండా రూ.కోట్ల అభివృద్ధి పనులు మేయర్ ముందస్తుగా ఆమోదిస్తే వాటిని కౌన్సిల్ ఆమోదానికి పెట్టారు. దీనిపై వైఎస్సార్ సీపీ సభ్యులు గళమెత్తారు. అయినా లెక్క చేయకుండా మంద బలంతో అన్నింటినీ ఆమోదం చేసుకున్నారు. ట్రంకు రోడ్డు, ముస్లిం బరియల్ గ్రౌండ్ విషయంలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ అడుగడుగునా అడ్డుతగిలారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు వైఎస్సార్ సీపీ కో ఆప్షన్ సభ్యురాలు రషీదా కూడా ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ గళం వినిపించారు. ఇరువురూ కలిసి రెండు సార్లు టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గొంతెత్తి నిలదీశారు. ముస్లిం బరియల్ గ్రౌండ్ విషయంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.. ఒంగోలు అర్బన్ తహశీల్దార్ పిన్నిక మధుసూదన్ రావును కౌన్సిల్ సమావేశానికి హుటాహుటిన పిలిపించారు. ముస్లిం బరియల్ గ్రౌండ్‌కు కమ్మపాలెం తరువాత దశరాజుపల్లి రోడ్డు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలం కాకుండా ముక్తినూతలపాడు రోడ్డులో మూడు ఎకరాలు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే కౌన్సిల్‌లో ప్రకటించారు. దాంతో వైఎస్సార్ సీపీతో పాటు కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీకి చెందిన జనసేన నాయకుడు, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు కూడా ఆ స్థలం విషయంలో అడ్డుతగిలారు. అయినా తహశీల్దార్ పిన్నిక మధుసూదనరావు కుంట పోరంబోకులో మెరక ఉంది దానిని కేటాయిస్తున్నామన్నారు. కన్వర్షన్ లేకుండా ఏవిధంగా కేటాయిస్తారు...అందుకు సంబంధించిన వివరణ ఇవ్వాలని అడిగినా సమాధానం లేకుండా పోయింది. దాంతో పాటు యాదవ భవన్ విషయంలో కూడా ఎమ్మెల్యే మాట మార్చారు. దిబ్బల రోడ్డు యాదవ భవన్ స్థలం ప్రస్తావన తీసుకొచ్చారు. ట్రంకు రోడ్డు విస్తరణ విషయం కోర్టు పరిధిలోకి పోయింది కాబట్టి నగర ప్రజల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే దాటేశారు. మస్తాన్ దర్గా నుంచి కొత్తపట్నం బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ విషయం కూడా వ్యాపారులు, స్థానికుల ఆలోచనల మేరకు ఏకాభిప్రాయంగానే నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ‘సాక్షి’ దిన పత్రికలో శుక్రవారం వచ్చిన కథనంపై అక్కసు వెళ్లగక్కారు. సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వర రావు, ఎంఈ ఏసయ్య, ఏసీపీ సుధాకర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అన్నీ ఏకపక్ష తీర్మానాలే