సమన్వయంతో పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి

Sep 13 2025 7:17 AM | Updated on Sep 13 2025 7:17 AM

సమన్వ

సమన్వయంతో పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి

జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అక్రమంగా పింఛన్లు తొలగించారంటూ ఎమ్మెల్యేలు బూచేపల్లి, తాటిపర్తి ధ్వజం ఐదేళ్లుగా పింఛన్‌ తీసుకుంటున్న వారిని ఎలా తొలగించారు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు కనీసం ప్రొటోకాల్‌ పాటించడంలేదని బూచేపల్లి ఆగ్రహం తొలగించిన పింఛన్లు ఇవ్వాలంటూ సభ్యులు డిమాండ్‌

పెన్షన్లపై మెడికల్‌ రీ అసెస్మెంట్‌

ఒంగోలు సిటీ: జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు. పాత జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ సంబంధిత పనులు ఊపందుకుంటున్నందున వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. ప్రకాశం జిల్లా డీఆర్వో బి.చిన ఓబులేసు, జెడ్పీ సీఈవో చిరంజీవి, బాపట్ల జిల్లా ఇన్‌చార్జ్‌ జాయింట్‌ కలెక్టర్‌ గంగాధర గౌడ్‌, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌, ఉమ్మడి ప్రకాశం జిల్లా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్‌, డీఆర్‌డీఏ, విద్యుత్‌, రోడ్లు – భవనాలు, వైద్య, వ్యవసాయ శాఖల్లోని సమస్యలపై ప్రధానంగా చర్చించారు.

ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ చీమకుర్తి మండలంలో ఎంతో మంది వికలాంగులు తమకు పింఛన్‌ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. వికలాంగులను పెన్షన్‌ కోసం ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమన్నారు. మన జిల్లాలో ఒక మహిళ పెన్షన్‌ కోసం ఆఫీస్‌కు వెళితే ఆమె చనిపోయినట్లు రాశారన్నారు. బతికి ఉన్న మనిషిని కూడా చనిపోయినట్లు రాశారంటే ఒకసారి అందరూ ఆలోచించాలన్నారు. వికలాంగులు, వితంతువులను పింఛన్ల కోసం ఇబ్బంది పెట్టడం తగదన్నారు.

అర్హత ఉన్నా వికలాంగ పింఛన్‌ తొలగించారు..: యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌

70 శాతం వికలాంగుడిగా సర్టిఫై చేసిన వ్యక్తిని 40 శాతంగా ఎవరు నిర్ధారించారు ? ఎలా నిర్ధారించారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ అధికారులను నిలదీశారు. టీడీపీ వారు చెప్పారని ఆ పనిచేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వై.చెర్లోపల్లికి చెందిన 70 ఏళ్ల వికలాంగురాలికి సైలెన్‌ కూడా మంచంలోనే పెట్టి ఉందని, ఇటువంటివారి పింఛన్‌ను కూడా తీసేశారని, ఆ హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. 30 విడో పింఛన్లు తొలగించారని, ఆ వివరాలు ఆన్‌లైన్‌లో కనిపిస్తాయని, వేలిముద్ర వేయడానికి వెళ్తే వేసుకోరని విమర్శించారు. 2,896 మంది వికలాంగులను ఏ డాక్టరు వచ్చి చెక్‌ చేశారనీ, ఏ డాక్టరు సర్టిఫై చేశారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు మాట్లాడే సమయంలో మంత్రి లేకపోవడం శోచనీయమన్నారు. అధికారులు మళ్లీ మీటింగుకు వచ్చే వరకు కనపడరని, మెసేజ్‌ లకు అధికారులు రెస్పాండ్‌ కావడంలేదని ఆరోపించారు. కలెక్టర్‌, మంత్రి ఓఎస్డీ దృష్టికి తీసుకెళ్లామని ఈ సమస్య ఎట్లా తీరుతుందనీ, సమస్య తీరనప్పడు ఈ వ్యవస్థలు, మీటింగ్‌లు ఎందుకు అని ప్రశ్నించారు. మీరు అడ్డగోలుగా అక్రమంగా పింఛన్లు తీసేస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ 2,896 మందితో మీ ఆఫీస్‌ వద్దకు వచ్చి ధర్నా కూర్చుంటామని హెచ్చరించారు. ఒకే నియోజకవర్గంలో ఇంతమంది ఉంటారా అని, ఈ సమస్యను పీడీ నారాయణ త్వరగా పరిష్కరించాలని కోరారు. అర్హత లేని వ్యక్తిని ఎంపీడీఓగా నియమిస్తున్నారని, కలెక్టర్‌ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఉపయోగం లేదన్నారు. యర్రగొండపాలెం పంచాయతీ, త్రిపురాంతకం పంచాయతీల్లో గ్రేడ్‌–1 ఈఓను నియమించాల్సిందిపోయి గ్రేడ్‌–3 ఆఫీసర్‌ ని నియమిస్తున్నారని ఇలా చేస్తే వ్యవస్థలు ఎలా నడుస్తాయని ధ్వజమెత్తారు. కాలువలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. నీరు పారేలా కాలువలను శుభ్రం చేయించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. దోర్నాలలోని గండి చెరువు నుంచి నీరు లీకు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోర్నాల కమ్యూనిటీ ఆస్పత్రి, యర్రగొండపాలెం ఏరియా ఆస్పత్రుల్లో అవసరమైన వైద్యులు లేరని, దోర్నాల ఆస్పత్రిలో నీటి సమస్య నెలకొందని, యర్రగొండపాలెం ఆస్పత్రిలో బ్లడ్‌ బ్యాంక్‌ లేదని అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని ఇతర మండలాల నుంచి యర్రగొండపాలెం కేంద్రానికి అనుసంధానమైన రోడ్లలో మరమ్మతు పనులు వేగవంతం చేయాలని ఆయన కోరారు.

గతంలో పెన్షన్లు పొందిన వారు ప్రస్తుతం పెన్షన్లకు దూరమయ్యారని, అర్హులైన తమకు అన్యాయం జరుగుతోందని వారు ఆందోళన చెందుతున్నారని దర్శి, వైపాలెం ఎమ్మెల్యేలతో పాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా సందర్భంగా అధికారుల దృష్టికి తెచ్చారు. దీనిపై డీఆర్డీఏ పీడీ నారాయణ మాట్లాడుతూ అర్హులందరికీ పెన్షన్లు వస్తాయని, మెడికల్‌ రీ అసెస్మెంట్‌ జరుగుతోందని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చని చెప్పారు.

ఇతర జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా రోడ్ల విషయంలో స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. స్థానికంగా జరుగుతున్న మరమ్మతు పనుల పురోగతిని ఆర్‌అండ్‌బీ అధికారులు వారికి వివరించారు.

తమ ప్రాంతంలో విద్యుత్‌ తీగలు కిందకు వేలాడుతున్నాయని, ట్రాన్‌ఫార్మర్ల కోసం డీ.డీ.లు కట్టిన రైతులు వాటి కోసం ఎదురు చూస్తున్నారని ప్రజా ప్రతినిధులు చెప్పగా, ట్రాన్స్‌ఫార్మర్లు త్వరగా అందేలా చూస్తామని, విద్యుత్‌ తీగలను సరి చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ స్థాయి సంఘాల సమావేశాల్లో చేసిన తీర్మానాలను సమావేశం ఈ సందర్భంగా ఆమోదించింది.

సమన్వయంతో పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి1
1/1

సమన్వయంతో పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement