
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి తీవ్రగాయాలు
పెద్దదోర్నాల/కొనకనమిట్ల: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం చోటుచేసుకున్న రెండు ప్రమాదాల్లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దదోర్నాల మండలంలో కర్నూలు–గుంటూరు జాతీయ రహదారిలోని కొర్రప్రోలు ఫారెస్ట్ చెక్‌పోస్టు సమీపంలో ఆటో ఆదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గుడ్డెపోగు రమేష్, జీనేపల్లి హరిశ్చంద్రప్రసాద్, వెంకటేశంకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. ఎండు కట్టెల కోసం నల్లగుంట్ల నుంచి పెద్ద మంతనాల వైపు ఆటోలో వెళ్తుండగా కొర్రప్రోలు చెక్ పోస్టు సమీపంలో బోల్తా పడింది. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన యువకులు తలకు తీవ్ర గాయమైన వెంకటేశంను గుంటూరు తరలించగా, మిగిలిన ఇద్దరిని 108 అంబులెన్స్‌లో పెద్దదోర్నాల ఆస్పత్రిలో చేర్చారు. వీరిని మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేట వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పోలీసులు పరామర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లారీని ఢీకొట్టిన బైక్
పొదిలి బెస్తపాలేనికి చెందిన పెరమసాని మల్లికార్జున కొనకనమిట్ల మండలం గనివానిపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయనకు ఇటీవల గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శిగా ప్రమోషన్ దక్కింది. ఈ నేపథ్యంలో కనిగిరి మండలంలో కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్న పంచాయతీల వివరాలు తెలుసుకునేందుకు శుక్రవారం సాయంత్రం తన బైక్‌పై వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో చినారికట్ల జంక్షన్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని చీకట్లో గమనించక వెనక భాగంలో ఢీకొట్టారు. బైక్ నుంచి ఎగిరి కింద పడిన మల్లికార్జున తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌లో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించినట్లు మల్లికార్జున బంధువులు తెలిపారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి తీవ్రగాయాలు