
పొగాకు పంట నియంత్రణ పాటించాలి
టంగుటూరు:
రైతులు పొగాకు పంట సాగులో నియంత్రణ పాటించాలని పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్, వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య అన్నారు. టంగుటూరు పొగాకు బోర్డును బుధవారం సందర్శించి పొగాకు వేలం ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా 2025–26 పంట కాలానికి పొగాకు పంట నియంత్రణ మీద నిర్వహించిన అవగాహన సదస్సులో రైతులతో మాట్లాడారు. దేశీయంగా, విదేశాలలో ఎఫ్ సీవీ పొగాకుకు ఉన్న గిరాకీని, నిల్వలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో 2025–26 పంట కాలానికి 142 మిలియన్ కేజీల ఉత్పత్తికి అనుమతించినట్లు తెలిపారు. దక్షిణ ప్రాంత నల్ల రేగడి నేలలు (ఎస్‌బీఎస్) బ్యారన్ ఒక్కింటికి 3565 కేజీల పంట సాగుకు అనుమతించారన్నారు. అలాగే వివిధ దేశాల్లో 2025–26 పంట కాలానికి పండించిన పొగాకు ఉత్పత్తి గణాంకాలను వివరించి, రైతులు రాబోయే పంట కాలానికి రైతులు తమకు కేటాయించిన మేరకే పొగాకు సాగు చేపట్టాలని సూచించారు. అధిక ధరలతో భూమి, బ్యారన్‌లు కౌలుకు తీసుకొని పొగాకు సాగు చేయరాదన్నారు. అలాగే కొత్తగా అనధికారికంగా బ్యారన్ లు నిర్మించవద్దని చెప్పారు. వాణిజ్య సరళిలో ఎఫ్ సీవీ పొగాకు నారుమడి సాగు చేసే రైతులందరూ తప్పనిసరిగా వారి పరిధిలోని పొగాకు బోర్డు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాసరావు, పొగాకు రైతు సంఘం నాయకులు పోతుల నరసింహారావు, పొగాకు బోర్డు సిబ్బంది పాల్గొన్నారు.