
రైతు బజార్లను పరిశీలించిన జేసీ
ఒంగోలు సబర్బన్: జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఒంగోలు నగరంలోని మూడు రైతు బజార్లను బుధవారం సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు సరఫరా చేస్తున్న కర్నూలు ఉల్లిపాయాల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను, వినియోగదారులను కూరగాయల ధరలను అడిగి తెలుసున్నారు. ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు బజార్ల పరిసరాలు, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. జేసీ వెంట ఇతర అధికారులు ఎం.వరలక్ష్మీ, ప్రతాప్ రాజ్ కుమార్, డీఈఈ టి.పవన్ కుమార్‌తో పాటు రైతు బజార్ల ఎస్టేట్ అధికారులు పాల్గొన్నారు.