
గుంభనంగా విచారణ!
రూ.కోట్లు కొల్లగొట్టినా..
సాక్షి టాస్క్‌ఫోర్స్:
సుమతి శతక పద్యంలోని ’’చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైనట్లు..’’ వాక్యం.., అలాగే ‘‘రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవేముంది’’ అన్న తెలుగు సామెత అతికినట్లు సరిపోయే సంఘటన ఇది. పొగాకు వ్యాపారం చేసి, అక్రమ మార్గాలను అనుసరించి టంగుటూరు టీడీపీ నేత కూడబెట్టిన సొమ్ములో రూ.20 కోట్లను తన కింద పనిచేసే గుమస్తా కాజేసిన వ్యవహారం, అందుకు సంబంధించిన విచారణపై రోజుకో కథనం బయటకొస్తోంది. చిన్న చోరీ జరిగితే తక్షణమే అక్కడ వాలిపోయి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టే పోలీసులు.. టీడీపీ నేత పొగాకు కంపెనీలో రూ.20 కోట్లు గోల్‌మాల్ అయిన విషయంపై పెద్దగా స్పందించడం లేదు. మంత్రి ఆదేశాలతో ఫిర్యాదు లేకుండానే రంగంలోకి దిగి సెటిల్‌మెంట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులకు బాధిత టీడీపీ నాయకుడే అడ్డు తగిలినట్లు జోరుగా చర్చ నడుస్తోంది.
మోసగాడే మోసపోయాడు!
తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడన్న సామెత పొగాకు కంపెనీ నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో నిజమైంది. పొగాకు కంపెనీలో గుమస్తా చేతివాటం చూపించి రూ. 20 కోట్లు డబ్బులు కాజేయగా, గుమస్తా వద్ద సైబర్ నేరగాళ్లు రూ.7 కోట్లు మాయం చేశారు.
ఆరు నెలల క్రితమే స్కెచ్
టీడీపీ నేత సింగపూర్‌లో ఒక వివాహానికి వెళ్లడం, కొద్ది రోజుల తర్వాత తండ్రి మృతి చెందడం, పొగాకు కంపెనీల కార్యక్రమానికి విదేశానికి వెళ్లడం, తన కూతురు, భార్య అమెరికా వెళ్లే పనులను చక్కబెడుతూ ఆరు నెలలుగా వ్యాపార లావాదేవీలు పట్టించుకోలేదు. ఇదే అదనుగా భావించిన గుమస్తా క్రమంగా రూ.20 కోట్లు దారి మళ్లించాడు. అయితే ఒక లావాదేవీలో గుమస్తా బ్యాంకు ఖాతాకు రూ.90 వేలు జమ కావడాన్ని గుర్తించిన టీడీపీ నేత విషయం ఆరా తీయడంతో గోల్‌మాల్ వ్యవహారం బయటపడింది. ఓ మంత్రి సహకారంతో సిట్ అధికారులు, జిల్లా పోలీసులకు సమాచారం అందించి విచారణకు పూనుకున్నారు. గుమస్తాను బంధించి, అతని బావమరిదికి చెందిన టెంటు హౌసుకు తాళం వేశారు. మూడు డీజే వాహనాలను స్వాధీనం చేసుకుని పొగాకు కంపెనీలో ఉంచారు. ప్రస్తుతం యజమాని, గుమస్తా మధ్య శాంతి చర్చలు జరుతున్నాయని సమాచారం. పొగాకు కంపెనీలో పనిచేసే సిబ్బందిని సైతం రెండు రోజులపాటు పనికి రావద్దని చెప్పడం అందుకు బలం చూకూరుస్తోంది. కొండపి మండలం గోగినేనివారిపాలెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి గుమస్తా రూ.2 కోట్లు బదిలీ చేసినట్లు తేలడంతో అతనిని కూడా పొగాకు కంపెనీలో గోప్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు గుమస్తా నుంచి 1.900 కిలోల బంగారం, అతని ఇంట్లో బెడ్ కింద దాచిన కొంత ధనం.. వెరసి మొత్తం రూ.8 కోట్ల మేర రికవరీ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని టంగుటూరు పోలీసులు చెబుతుండటం గమనార్హం.
టంగుటూరు ఎస్సైపై హైకోర్టుకు ఫిర్యాదు
అధికార టీడీపీ నాయకుల ఒత్తిడితో టంగుటూరు గ్రామానికి చెందిన గుమస్తాను ఎస్సై నాగమళ్లీశ్వరరావు రెండు రోజులపాటు విచారణ పేరులో చిత్రహింసలు పెట్టారని, కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు అందుకున్న ఎస్సై హైర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరైనట్లు సమాచారం.
టంగుటూరు టీడీపీ నేత పొగాకు కంపెనీలో రూ.20 కోట్ల సొమ్ము గోల్‌మాల్
ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఫిర్యాదు లేకుండానే విచారణకు పూనుకున్న పోలీసులు
అక్రమ వ్యాపారం గుట్టు రట్టవుతుందని పోలీసులను సైడ్ చేసిన వైనం
తన కంపెనీ గోడౌన్‌లోనే గుమస్తాను గోప్యంగా విచారిస్తున్న టీడీపీ నేత
1.9 కేజీల బంగారం, రూ.8 కోట్ల నగదు రికవరీ చేసినట్లు జోరుగా ప్రచారం
ఇప్పటికీ ఫిర్యాదు అందలేదంటున్న టంగుటూరు పోలీసులు
గుమస్తాను రెండు రోజులు చిత్రహింసలు పెట్టినట్లు టంగుటూరు ఎస్సైపై హైకోర్టుకు ఫిర్యాదు
అక్రమాల గుట్టు రట్టవుతుందనేనా?
గత నాలుగైదేళ్లుగా టంగుటూరు టీడీపీ మండల అధ్యక్షుడి తమ్ముడు పొగాకు వ్యాపారం ద్వారా పెద్ద మొత్తంలోనే లాభాలు ఆర్జించినట్లు సమాచారం. అక్రమ మార్గాలు అనుసరించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం, పొగాకు బోర్డుకు చెల్లించాల్సిన రుసుముకు ఎగనామం పెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా రైతుల వద్ద అతి తక్కువ ధరకు పొగాకు కొనుగోలు చేసి స్వదేశీ, విదేశీ కంపెనీలకు విక్రయించడం లాంటి వ్యవహారాలతో టీడీపీ నేత రూ.కోట్లు కూడబెట్టినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. కంపెనీలో రూ.20 కోట్లు దారి మళ్లించిన గుమస్తాను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అక్రమాల బాగోతం బట్టబయలవుతుందని భావించిన టీడీపీ నేత.. గుమస్తాను విచారించేందుకు తనే రంగంలోకి దిగినట్లు తెలిసింది. గత కొద్దిరోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గుమస్తాను విచారించి లావాదేవీల లెక్కలు తేల్చి, సాయంత్రానికి గుమస్తాను తన ఇంటికి పంపిస్తున్నట్లు స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.

గుంభనంగా విచారణ!