
మంత్రి హామీలు నీటి మూటలేనా.. ?
● మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకుల ప్రశ్న
ఒంగోలు టౌన్: సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు ఇస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇచ్చిన హామీ కేవలం నీటి మూటేనా అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొర్నిపాటి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశం బుధవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహిచంచారు. ఈ సందర్భంగా కొర్నిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ...మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జూలై 10 రోజుల పాటు సమ్మె నిర్వహించారని, అనంతరం జరిగిన చర్చల సందర్బంగా సమ్మె కాలపు వేతనాలను చెల్లిస్తామని మంత్రి చెప్పారని గుర్తు చేశారు. ఆయన ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదన్నారు. జిల్లాలో చనిపోయిన, అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు అనేక మంది ఉన్నారని, ఆ స్థానంలో వారి కుటుంబసభ్యులకు ఉపాధి చూపాలని కోరుతుంటే అదుకు భిన్నంగా టీడీపీ కార్యకర్తలతో ఆయా స్థానాలను భర్తీ చేస్తున్నారని, ఇదేం న్యాయమని ప్రశ్నించారు. కోవిడ్ కార్మికులను ఆప్కాస్‌లో తీసుకోవాలని, కనీస వేతనాలను అమలు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. ఒంగోలులో మున్సిపల్ కార్మికులపై రాజకీయ వేధింఫులు ఎక్కువయ్యాయని, సమస్యలు పరిష్కరించకుండా పనిభారాన్ని పెంచడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదన్నారు. మున్సిపల్ కార్మికులపై పనిభారాన్ని తగ్గించాలని, న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కార్మికులందరినీ ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సామ్రాజ్యం, సుబ్బరాయుడు, పి.పద్మ, మరియమ్మ, ఏడుకొండలు, చెన్నమ్మ పాల్గొన్నారు.