
బాబు నైజం
నమ్మక ద్రోహం..
పుల్లలచెరువు: తాము అధికారంలోకి వస్తే జగన్ కంటే రెండింతలు సంక్షేమ పథకాలు ఇస్తానని ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు సీఎం అయ్యాక ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. మండల కేంద్రంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం బుధవారం జిల్లా కార్యవర్గసభ్యుడు డి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయడం, అబద్ధాలు ఆడటం తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు రాష్ట్రంలో ప్రజలకు గుర్తుండే పథకం ఏదైనా చేశాడా అని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గుర్తు చేసుకుంటారని అన్నారు. పేద ప్రజల వద్దకు పరిపాలన తెచ్చిన ఘనత జగనన్నకు దక్కుతుందని అన్నారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఒక్కసారి 50 వేల డాక్టర్ పోస్టులు ఇచ్చిన ఘనత జగనన్నదన్నారు. బాబు ష్యూరిటీ అంటూ ఎన్నికల్లో గెలవక ముందు ఒక్కొక్క ఇంటికి రూ.6 లక్షలు, రూ.5 లక్షలు ఇస్తానంటూ చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చారన్నారు. సూపర్‌సిక్స్ పథకాలంటూ 143 హామీలు అమలు చేస్తామని చెప్పి మళ్లీ ప్రజలను మోసం చేశారన్నారు. అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన తరువాత పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రెడ్‌బుక్ పేరుతో స్వీయ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో వారి దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి క్యూ ఆర్‌కోడ్ లను ఆవిష్కరించారు. దీనిని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.
నియోజకవర్గంలో దోచుకోవడమే లక్ష్యంగా కూటమి నాయకులు:
నియోజకవర్గంలోని కూటమి నాయకులు చేయని దోపిడీ అంటూ లేదని, ఇసుక, మద్యం, బియ్యం లాంటి అక్రమ పనులు చేస్తూ దోచుకుంటున్నారని అన్నారు. గ్రామాల్లోకి ఇసుక రావాలంటే కప్పం కట్టందీ రాదని, వస్తే వారిపై కేసులు నమోదు చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఇటీవల నియోజకవర్గంలో 20 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్‌ను జేసీబీలతో తవ్వుకుని కోట్ల రూపాయలు దోచుకునేందుకు కూటమి నాయకులు ప్లాన్ చేశారని, దానిని జిల్లా అధికారులకు తెలియజేసి ఆపేశామని అన్నారు.
ఎస్టీలకు అన్యాయం:
నియోజకవర్గ మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఎస్టీకి కేటాయిస్తే దానిని అగ్రవర్ణాల వారికి కట్టపెట్టారని ఇది ఎస్టీలకు అన్యాయం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఇదే జగనన్న పరిపాలలో ఎస్సీ, ఎస్టీలకు తగిన న్యాయం జరిగిందని, చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీలు అంటే ఏహ్యభావం ఉందని అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజనుల నృత్యాలతో స్వాగతం పలకగా, బస్‌స్టాండ్ సెంటర్ లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల హర్షధ్వానాల మధ్య సభావేదికకు చేరుకున్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీ బి.సుబ్బారెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఉడుముల అరుణ, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎల్.రాములు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జానకిరఘు, మాజీ ఎంపీపీ ఎం.సుబ్బారెడ్డి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
నీ పాలనలో గుర్తుండే పథకం ఒక్కటి చెప్పు బాబు సూపర్‌సిక్స్ పథకాలంటూ ప్రజలను మరోసారి మోసం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ సభలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం

బాబు నైజం

బాబు నైజం